
- జులైలోని 16 లక్షల నుంచి 20 లక్షల బీపీడీకి పెంపు
- ట్రంప్ టారిఫ్ ప్రభావం సెప్టెంబర్ చివరి నుంచి ఉంటుందని అంచనా
న్యూఢిల్లీ: భారత్ ఈ నెలలోని మొదటి 15 రోజుల్లో రష్యా నుంచి 20 లక్షల బ్యారెల్స్ పెర్ డే (బీపీడీ) క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేసింది. దిగుమతి చేసుకునే మొత్తం 52 లక్షల బీపీడీలో ఇది 38శాతానికి సమానం. గ్లోబల్ ట్రేడ్ ఎనాలసిస్ కంపెనీ కెప్లర్ డేటా ప్రకారం, ఈ ఏడాది జులైలో రష్యా నుంచి 16 లక్షల బీపీడీ దిగుమతి అవ్వగా, ఆగస్టులో ఈ నెంబర్ 20 లక్షల బీపీడీకి పెరిగింది. ఇరాక్ (7.3 లక్షల బీపీడీ), సౌదీ అరేబియా (5.26 లక్షల బీపీడీ) నుంచి కొనుగోళ్లు తగ్గడంతో రష్యా నుంచి పెరిగాయి. అమెరికా నుంచి 2.64 లక్షల బీపీడీ ఆయిల్ ఇండియాలోకి వస్తోంది. ట్రంప్ ప్రభుత్వం కొత్త టారిఫ్ ప్రకటించినప్పటికీ, ఆగస్టు సరఫరాలు జూన్, జులైలోనే ఖరారయ్యాయని కెప్లర్ ఎనలిస్ట్ సుమిత్ రిటోలియా అన్నారు.
ఈ టారిఫ్‌ల అసలు ప్రభావం సెప్టెంబర్ చివరి నుంచి కనిపిస్తుందని చెప్పారు. ఐఓసీ చైర్మన్ అర్విందర్ సింగ్ సహ్నీ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి రష్యా ఆయిల్ కొనుగోలు తగ్గించాలన్న సూచన లేదని పేర్కొన్నారు. బీపీసీఎల్ డైరెక్టర్ వేట్సా రామకృష్ణ గుప్తా ప్రకారం, రష్యా ఆయిల్ డిస్కౌంట్ బ్యారెల్‌పై 1.5 డాలర్లకి తగ్గడంతో కొనుగోళ్లు తగ్గాయి. అయితే డిస్కౌంట్ మళ్లీ 2 డాలర్లకి పెరిగింది. భారత రిఫైనర్లు అమెరికా, వెస్ట్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నాయని రిటోలియా అన్నారు. ఇది రష్యా నుంచి పూర్తిగా వెనక్కి తగ్గడం కాదని, కానీ ఎనర్జీ సెక్యూరిటీ, లాజిస్టికల్ రిస్క్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా వ్యూహాత్మక మార్పని చెప్పారు.