ఆయిల్ పామ్ సాగుతో లాభాలు .. ఉమ్మడి మహబూబ్‌‌ నగర్ జిల్లాలో పెరిగిన సాగు

ఆయిల్ పామ్ సాగుతో లాభాలు .. ఉమ్మడి మహబూబ్‌‌ నగర్ జిల్లాలో పెరిగిన సాగు
  • పది రోజుల నుంచి మొదలైన దిగుబడులు

మహబూబ్‌‌ నగర్, వెలుగు: ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు లాభాలు గడిస్తున్నారు. టన్ను దిగుబడికి కంపెనీలు చెల్లించే ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో ఖుషీలో ఉన్నారు. గత నాలుగేండ్లుగా ఈ పంటను సాగు చేస్తున్న రైతుల తోటల్లో ఇటీవల దిగుబడులు మొదలు కాగా.. 15 రోజులకోసారి గెలలను కట్ చేసి కంపెనీలకు తరలిస్తున్నారు. 

30,367 ఎకరాల్లో తోటలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 7,973 మంది రైతులు 30,367 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను పెంచుతున్నారు. ఇందులో నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ పంట సాగు ఎక్కువగా ఉంది. అయితే ఈ సాగు ప్రారంభించిన నాటి నుంచి నాలుగేండ్లకు దిగుబడులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 2020–21లో సాగులో ఉన్న తోటలకు గెలలు పట్టాయి. 

దీంతో రైతులు గెలలను కట్ చేస్తున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ల పర్యవేక్షణలో వీటి కటింగ్ తో పాటు తూకాలు చేస్తున్నారు. ప్రస్తుతం నెలలో రెండు సార్లు (15వ తేదీ, 30వ తేదీ) మాత్రమే ఆయిల్ పామ్ గెలలు కటింగ్ చేస్తారు. వీటిని తూకం వేయించి రైతులకు టన్ను పంటకు సర్కారు నిర్ణయించిన రూ.18,748 మద్దతు ధరను ఆయా కంపెనీల ద్వారా చెల్లిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కట్ చేసిన గెలలను భదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని టీజీ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి తరలించి నూనె తీస్తున్నారు. 

వరి, పత్తికంటే బెటర్

వరి, పత్తి పంటలు సాగు ఎరరాకు దాదాపు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికితోడు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. పంటలకు వైరస్, ఇతర వ్యాధులు సోకితే దిగుబడులు దెబ్బతిని నష్టం వస్తోంది. కాని.. ఈ రెండు పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడితో లాభాలు పొందొచ్చు. ఒకసారి ఆయిల్ పామ్ మొక్కలు నాటితే నాలుగో సంవత్సరం నుంచి 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. 

ఈ నాలుగేండ్లలో ఆయిల్ పామ్ తో  పాటు అంతర్ పంటలు కూడా సాగు చేసుకొని అదనపు ఆదాయం పొందొచ్చు. అయితే ఈ సాగును ప్రోత్సహించేందుకు మొక్కలు, ఎరువులు, అంతర పంటల సాగు, డ్రిప్ ఏర్పాటుకు మొదటి నాలుగేండ్లలో ప్రభుత్వం రూ.50,918 సబ్సిడీ  అందిస్తోంది. ఇందుకు గాను రైతు తన వాటా కింద ఒక్కొక్క మొక్కకు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో డ్రిప్‌ కు మాత్రం గైడ్ లైన్స్ ప్రకారం అందిస్తుంది. 

పంట వయసు ఆధారంగా ఎకరాకు వచ్చే దిగుబడి
పంట వయసు    దిగుబడి    ఖర్చు    ఆదాయం    లాభం
    ( టన్నుల్లో )


4వ ఏటా    04    15,794    54,800    39,006
5వ ఏటా    5.5    20,820    75,350    54,530
6 –30 ఏండ్లు    10    22,650    1,37,000    1,14,350

ఉమ్మడి జిల్లాలో పామాయిల్ సాగు వివరాలు

జిల్లా    రైతులు    మొత్తం ఎకరాలు
మహబూబ్‌‌నగర్    1102    4353.37
నాగర్ కర్నూల్    1881    7164.56
వనపర్తి    1618    5453.07
నారాయణపేట    1670    6567.36
జోగుళాంబ గద్వాల    1702    6829.04