అమెరికా– ఇరాన్ ఒప్పందంతో తగ్గుతున్న చమురు ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..?

అమెరికా– ఇరాన్ ఒప్పందంతో తగ్గుతున్న చమురు ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..?
  • 80 డాలర్లకు చేరిన బ్యారెల్​ రేటు
  • భారీగా దిగివచ్చిన ఎల్​ఎన్​జీ ధర
  • పాత ధరలు రావడానికి ఏడాది వరకు పట్టే చాన్స్​
  • ఇరాన్​పై ఆంక్షల తొలగింపుతో మన దేశానికి మేలే

న్యూఢిల్లీ:  అనుకున్నట్టుగానే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందంపై ఈ నెల 19న సంతకాలు జరిగితే మనదేశానికి ఊరట దొరుకుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా క్రూడాయిల్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎరువుల సరఫరాకు ఇబ్బందులు ఉండవు. 

ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. హార్మూజ్ జలసంధి  తెరుచుకోవడం వల్ల సరఫరాలకు ఆటంకాలు తొలగిపోతాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి 20 శాతం తగ్గాయి. ఎల్ఎన్జీ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చల్లారటం వల్ల మార్కెట్లలో భయాందోళనలు తగ్గాయని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సెహుల్ భట్ చెప్పారు.  

ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య పెట్రోల్, డీజిల్, ఎల్​పీజీ అండర్ రికవరీ విలువ రూ. లక్ష కోట్లుగా అంచనా వేశారు. ఇది డైరెక్ట్ క్యాష్ లాస్ (నష్టం) కాదు, కానీ కంపెనీలు ఆశించిన లేదా రావాల్సిన ఆదాయంలో వచ్చిన భారీ లోటు.  క్రూడ్ బాస్కెట్ ధర 90 డాలర్లు లోపు ఉంటే ఈ భారం పెరగదు. చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం, దేశ ఇంధన దిగుమతి బిల్లు తగ్గుతుంది. 

అయితే, గ్లోబల్ మార్కెట్లు సాధారణ స్థితికి రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని,   పాత ధరలు రావడానికి ఆరు నెలల నుంచి ఏడాది  పట్టవచ్చని ఇక్రా ఎనలిస్ట్​ ప్రశాంత్ వశిష్ట్ అన్నారు. యుద్ధంతో పశ్చిమ ఆసియాలో రోజుకు 10-–11 మిలియన్ బారెళ్ల ఉత్పత్తి నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు దెబ్బతిన్నాయి.    

  • మూడు నెలల కనిష్టానికి ధరలు

 అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం చమురు ధరలు మూడు నెలల కనిష్టానికి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మార్చి తర్వాత మొదటిసారి 80 డాలర్లు దిగువకు.. అంటే 79.96 డాలర్లు వద్దకు పడిపోయింది. చివరిగా ఇది 3.6 శాతం తగ్గి 80.19 డాలర్లు వద్ద ట్రేడయింది. వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్స్ 3.8 శాతం తగ్గి 77.71 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. 

ఫ్రాన్స్‌‌‌‌ లో జరుగుతున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) దేశాల అధినేతల చర్చల్లో ఈ అంశం చర్చకు రానుంది. అయితే, గ్లోబల్ ఇన్వెంటరీలు తగ్గడం వల్ల చమురు ధరలు ఇప్పటికిప్పుడు పాత కాలపు 65 డాలర్లు స్థాయికి చేరడం కష్టమని ఎనలిస్ట్​ మౌలిక్ పటేల్  చెప్పారు. సమీప కాలంలో ధరలు 75--–80 డాలర్లు పరిధిలో ఉండవచ్చని పేర్కొన్నారు. 

చైనా తన వ్యూహాత్మక నిల్వలను ఉపయోగించడం వల్ల ధరలు భారీగా పెరగకుండా అడ్డుకోగలిగింది. స్పాట్ ఎల్ఎన్​జీ ధరలు ప్రస్తుతం 17--–18 డాలర్లు పలుకుతున్నాయని,  ఇవి ప్రస్తుత ఏడాది పాత స్థాయి అయిన 10–--11 డాలర్లకు తగ్గడం కష్టమేనని ఆయన పేర్కొన్నారు.