కేరళలో 60ప్లస్‌.. పెరుగుతున్నరు

కేరళలో 60ప్లస్‌..  పెరుగుతున్నరు

    రాష్ట్ర జనాభాలో 13.1% మంది వృద్ధులే

    దేశ సగటు 8.3 శాతంతో పోలిస్తే ఎక్కువ

    ప్రస్తుతం 48 లక్షల మంది వృద్ధులు.. మహిళలే ఎక్కువ

     రాష్ట్ర ఎకనామిక్​ సర్వేలో వెల్లడి

చదువులో ఫస్ట్​ ఏ రాష్ట్రమంటే వచ్చే ఆన్సర్​.. కేరళ. అక్కడ 90 శాతంపైనే లిటరసీ రేట్​ ఉంటుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా దానికి యాడ్​ చేసుకోవాలేమో! దేశంలో వృద్ధులు ఎక్కువవుతున్న రాష్ట్రం ఏమిటి అని! అవును, దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ముసలోళ్ల సంఖ్య వేగంగా పెరిగిపోతోందట. గురువారం ఆ రాష్ట్రం విడుదల చేసిన ఎకనామిక్​ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కేరళ ఆర్థిక మంత్రి థామస్​ ఐజాక్​ ఈ సర్వేను అసెంబ్లీలో విడుదల చేశారు. ఆ సర్వేలోని వివరాలేంటో ఓ సారి చదివేద్దాం!!

దేశం కన్నా ఎక్కువే

1961లో కేరళలోని 60 ఏళ్లకు పైబడిన వారి జనాభా 5.1 శాతం. అది అప్పటి దేశ సగటు 5.6 కన్నా కొంచెం తక్కువ. అయితే, 1980 నుంచి సీన్​ మారిపోయింది. దేశ సగటును దాటిపోయింది. 2001 నాటికి రాష్ట్రంలోని వృద్ధుల జనాభా 10.5 శాతానికి పెరిగింది. అప్పుడు దేశ సగటు 7.5 శాతం. 2011 నాటికి 12.6 శాతానికి పెరగ్గా, దేశ సగటు కేవలం 8.6 శాతమే. 2015 జనాభా లెక్కల ప్రకారం కేరళలోని 60 ఏళ్లకు పైబడిన వారు 13.1 శాతం మంది ఉండగా, దేశ సగటు జస్ట్​ 8.3 శాతం. ప్రస్తుతం కేరళలో 48 లక్షల మంది 60 ఏళ్లకుపైబడిన వారున్నారు.  అందులో 15 శాతం మంది 80 ఏళ్లు దాటిన వారే. వృద్ధుల్లో ఎక్కువగా ఉన్నది ఆ ఏజ్​ గ్రూపోళ్లే.

మహిళలే ఎక్కువ

వృద్ధుల్లో మగాళ్లతో పోలిస్తే ఆడాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందులోనూ వితంతువులదే ఎక్కువ వాటా. ఆయుష్షుకు సంబంధించి దేశంలో కేరళ టాప్​లో ఉంది. సగటున మగవాళ్లు 72.5 ఏళ్లు, ఆడవాళ్లకు 77.8 ఏళ్ల ఆయుష్షు ఉంది. ‘‘దేశమంతటా మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల సగటు ఆయుష్షు ఎక్కువ. కానీ, కేరళలో అది మరింత ఎక్కువ. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి వసతులు పెరగడం వంటివి వృద్ధులు పెరగడానికి కారణమవుతున్నాయి. తక్కువ వయసున్న ఆడవాళ్లను మగవాళ్లు పెళ్లిచేసుకోవడం వల్ల వితంతువులు ఎక్కువవుతున్నారు. 2015 నేషనల్​ శాంపిల్​ సర్వే ప్రకారం 65% మంది వృద్ధులు రోగాల బారిన పడుతున్నారు’’ అని ఎకనామిక్​ సర్వే పేర్కొంది. వితంతువుల్లో 60 నుంచి 69 ఏళ్ల వారి వాటా 23% కాగా, 70 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 43.06%. 2025 నాటికి వృద్ధుల సంఖ్య 20 శాతానికి చేరే అవకాశం ఉంది.