రిటైర్​మెంట్​వయస్సులో రెస్ట్ లెస్​గా పనులు

రిటైర్​మెంట్​వయస్సులో రెస్ట్ లెస్​గా పనులు

హైదరాబాద్, వెలుగు: ఇంట్లో పెద్దలు ఉండాలనే భావనను నుంచి భారంగా ఫీల్​అయ్యే రోజులొచ్చాయి. కరోనా టైంలో తల్లిదండ్రులను, అత్తమామలను ఓల్డేజ్ హోంలలో చేర్పించినవారు చాలా మందే ఉన్నారు. వారిలో వృద్ధులకు త్వరగా కరోనా సోకుతుందనేమోనని భయంతో కొందరు, భారంగా భావించి మరికొందరు విడిచిపెట్టారు. అదే టైంలో పిల్లల వద్దే ఉంటూ చీదరింపులు ఎదుర్కొన్నవారు కూడా ఉన్నారు. పక్కనే ఉన్నా పట్టించుకోకపోవడంతో మలిదశలో మానసికంగా, శారీరకంగా కుంగిపోయారు. వారిలో కొందరు పిల్లలకు ఇక నుంచి భారం కాకూడదని భావించి ఆరు పదుల వయసులో తిరిగి కష్టపడడం స్టార్ట్​చేశారు. చేతనైన పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకుంటున్నారు. ఓపిక ఉన్నంత వరకు ఏదో ఒక పని చేసుకుని బతుకుతామని చెబుతున్నారు. అలాంటి వారు సిటీలో చాలా మందే ఉన్నారు. రిటైర్​మెంట్​వయస్సులో రెస్ట్ లెస్​గా పనులు చేస్తున్నారు. వృద్ధులు పనులు చేయడం కొత్తేం కాకపోయినా కరోనా కాలం నుంచి ఆ సంఖ్య పెరిగింది. ఉండే ఏరియాకు దగ్గర్లో కూరగాయలు అమ్ముకోవడం, కిరాణాషాపు, టీకొట్టు నడుపుకోవడం, రోడ్ల వెంట బట్టలు, చెప్పులు అమ్ముకోవడం, నిమ్మరసం, సోడా, జ్యూస్ బండ్లు పెట్టుకుని పొట్ట నింపుకుంటున్నారు. 

ఏదో ఒక పనిచేస్తూ.. 
రోజువారీ కూలీ పనులకు వెళ్తున్న వారిలో వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్లంతా పిల్లలు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా పర్లేదని, ఓపిక ఉన్నంత వరకు కష్టపడదాం అనుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు భారమవ్వడం ఇష్టంలేక పనుల కోసం రోడ్లెక్కుతున్నామని చెప్తున్నారు. బిల్డింగ్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్ పనులు,  బైక్ మెకానిక్ షాపులు నడపడం, వీధివీధి తిరుగుతూ స్నాక్స్ అమ్మడం చేస్తున్నారు. పిల్లలకే చేదోడువాదోడుగా నిలుస్తున్నవారు కూడా ఉన్నారు. లాక్ డౌన్ ఉద్యోగాలు కోల్పోయిన పిల్లలకు వ్యాపారాల్లో తోడుగా ఉంటున్నారు. అమ్మనాన్నలు ఇంట్లో వంటలు చేసి క్యారేజీలు కడితే వాటిని తీసుకొచ్చి హోమ్ మేడ్ ఫుడ్ గా పిల్లలు రోడ్లపక్కన బండ్లమీద అమ్ముతున్నారు. ఇలా ఏదో ఒక పనిచేస్తూ ఎవరికీ భారం కాకుండా బతుకుతున్నారు. 

ఇంట్లోనే వండుకుని..
గతేడాది నా భర్తకు యాక్సిడెంట్ అయ్యి మంచానికి పరిమితం అయ్యారు. మొన్నటి దాకా ఆయన సంపాదనతోనే ఇల్లు గడిచేది. యాక్సిడెంట్​తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పిల్లలు దగ్గరకు వెళ్లి వాళ్లను బాధపెట్టలేం. నాకు తెలిసింది వంట చేయడమే. ఇంట్లోనే మీల్స్​రెడీ చేసి రోడ్​సైడ్ చిన్న టేబుల్ వేసి అమ్మడం మొదలుపెట్టాను. పెట్టుబడి పోను కొంత మిగులుతోంది. కుటుంబం గడుస్తోంది.
- సలీమా, ఓల్డ్ సిటీ