ఓంకార స్వరూపా.. సిద్ధి వినాయకా..!!

ఓంకార స్వరూపా.. సిద్ధి వినాయకా..!!

కథ స్కందపురాణంలోనిదిగా పరిగణిస్తున్నారు. గజాసురుని తపస్సుకి మెచ్చి అతడు కోరినట్టు అతడి ఉదరంలో ఉండిపోయాడు శివుడు. పార్వతి అడిగిందని విష్ణుమూర్తి గజాసురుని వద్దకు వెళ్ళి, గంగిరెద్దుల మేళం ఆడించి, వాడిని మెప్పించి, శివుడ్ని ఇమ్మని అడిగాడు. తన గర్భంలో ఉన్న శివుడు తన శిరస్సుని త్రిలోకపూజ్యంగా చేయాలని, శివుడు తన చర్మాన్ని ధరించాలని గజాసురుడు కోరాడు. నందీశ్వరుడు తన కొమ్ములతో చీల్చగా శివుడు బయటపడి, విష్ణువుని కీర్తించి కైలాసానికి బయల్దేరతాడు. భర్త వస్తున్న వార్త తెలిసిన పార్వతి అభ్యంగనస్నానం చేస్తూ, నలుగుపిండితో ఒక బాలుని విగ్రహం చేసి, ప్రాణం పోసి వాకిట్లో కాపలా పెట్టింది. ఆ బాలుడు శివున్ని అడ్డగించగా శివుడాతని శిరస్సు ఖండించాడు. మాటల మధ్య బాలుని గురించి తెలుసుకుని తను చేసిన పనికి బాధపడి, తాను తెచ్చిన గజాసురుని శిరస్సుని ఆ బాలుని మొండానికి అతికించి గజాస్యుడని పేరు పెట్టాడు. కొంతకాలానికి కుమారస్వామి జన్మించాడు.
 
దేవతలు, మునులు, మానవులు తమకొక విఘ్నాధిపతినిమ్మని శివుని ప్రార్థించారు. గజాననుడు, కుమారస్వామి తనకే ఆ ఆధిపత్యం ఇవ్వమని అడిగారు. ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా వచ్చిన వారికి ఇస్తానని శివుడు చెప్పాడు. కుమారస్వామి నెమలినెక్కి ఎగిరిపోయాడు.గజాననుడు దీనంగా తండ్రిని సులభోపాయం కోసం ప్రార్థించాడు. శివుడతనికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. దానినొక్కసారి జపిస్తే మూడు వందల కల్పాలు, పుణ్యనదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందట. గజాననుడు ఆ మంత్రం జపిస్తూ ఉండిపోయాడు. అందుచేత కుమారస్వామికి గజాననుడు ప్రతి నదిలోనూ తన కన్నా ముందుగా స్నానంచేసి ఎదురు వస్తునట్టు కనిపించాడు. దానితో భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపతి అయ్యాడు. ఆనాడు అందరూ ఇచ్చిన కుడుములు మొదలైన పిండివంటలు తిని మిగిలినవి చేతులలో పట్టుకుని, సూర్యాస్తమయ సమయానికి కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రులకు నమస్కరించబోగా, కాళ్ళూచేతులు నేలకు ఆనలేదు. ఈ అవస్థని చూచి శివుని జటాజూటంలో ఉన్న చంద్రుడు నవ్వాడు. ఆ నవ్వుకి వినాయకుని పొట్ట పగిలి విగతజీవుడయ్యాడు. ఇది చూసిన పార్వతి.. ఆగ్రహంతో “చంద్రుని చూసిన వారికి నీలాపనిందలు వస్తాయని శపించింది. దేవతలు ప్రార్థించగా, దానిని భాద్రపద శుద్ధ చవితికి పరిమితం చేసింది.

ఋషిపత్నులకథ, శమంతకోపాఖ్యానం వినాయక చవితి కథలో మనం తప్పనిసరిగా చదివేవి. శమంతకోపాఖ్యానం భాగవతంలో ఉన్న కథ. వ్రతకల్పంలో చేర్చారు. ఇంకా ప్రాంతాలలో వేర్వేరు కథలు వ్యాప్తిలో ఉన్నాయి. కొన్ని పురాణాధారితాలు. మరికొన్ని జానపదుల ఊహలలోనుండి పుట్టినవి.

ఓంకార స్వరూపుడు

ప్రణవనాదమైన ఓంకారం ఆకారంలోనే వినాయకుడు కనిపిస్తాడు. అందుకే ఆయన ఓంకార స్వరూపుడు. చాలావరకు పురాతన వినాయక విగ్రహాలు కూడా దేవనాగరి లిపిలోని ఓంకారం ఆకారంలోనే ఉంటాయి. ముద్గల పురాణం ప్రకారం వినాయకునికి వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అనే ఎనిమిది అవతారాలు ఉన్నాయి. ఈ ఎనిమిదింటిలోనూ ఐదు అవతారాలకు వినాయకుని వాహనం ఎలుక. వక్రతుండ అవతారానికి సింహం, వికటావతారానికి నెమలి, విఘ్నరాజ అవతారానికి శేషువు వాహనాలు.