కాంగ్రెస్​ అగ్రనేతలు కలిసొస్తారా?

కాంగ్రెస్​ అగ్రనేతలు కలిసొస్తారా?

నేడు కోదాడలో పార్టీ ముఖ్యనేతలతో మాణిక్​రావ్​ థాక్రే సమావేశం

నల్గొండ, వెలుగు : ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా హాత్​సే హాత్​ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం యాత్రకు హస్తం అగ్రనేతలు కలిసొస్తారా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాత్​సే హాత్​జోడో యాత్ర ప్రారంభ సభ బుధవారం కోదాడలో జరగనుంది. కాంగ్రెస్​పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావ్​థాక్రే, ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నల్గొండ ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్​ఉత్త మ్​కుమార్​రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు ఉమ్మడి జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలందరికీ ఆహ్వానం అందింది. ఉమ్మడి జిల్లాలో జోడో యాత్ర ప్రిపరేటరీ మీటింగ్​కోదాడ, హుజూర్​నగర్​నియోజకవర్గాల్లో మాత్రమే జరిగింది. ఫిబ్రవరి 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన యాత్ర రెండు నెలల్లో ముగించాల్సి ఉండగా ఇప్పటికే 23 రోజులు పూర్తయింది. కానీ ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో యాత్ర సాగడం లేదు. పలు నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాల వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోఉమ్మడి జిల్లా పార్టీ నేతలందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి జోడో యాత్రలో జోష్​ పెంచేందుకు కోదాడలో థాక్రే సభ ఏర్పాటు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదులో దేశంలోనే అగ్రస్థానంలో హుజూర్​నగర్, కోదాడ నియోజకవర్గాలు నిలిచాయి. ఈ రెండు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్​లో ఉండటంతో ఎంపీ ఉత్తమ్​ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని థాక్రే చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఉత్తమ్​ రాజకీయ భవిష్యత్తుకు పునాది పడ్డ కోదాడ వేదికగా బుధవారం యాత్ర ప్రారంభం కానుంది. ఈ వేదిక మీది నుంచి ఉమ్మడి జిల్లాలో పార్టీ శ్రేణులకు యాత్ర గురించి దిశా నిర్దేశం చేయనున్నారు. దీనికోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా, పార్టీ సీనియర్లు జానారెడ్డి, దామోదర్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్, పాల్వాయి స్రవంతి, బీర్ల అయిలయ్య, డీసీసీ అధ్యక్షులు శంకర్​నాయక్, కుంభం అనిల్​కుమార్​రెడ్డితో సహా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పార్టీ ఆదేశాలు పంపింది. అయితే ఉమ్మడి జిల్లాలో పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలకు ఫుల్​స్టాప్​పెట్టడంలో పార్టీ ముఖ్యనేతలు విఫలమయ్యారు. ముఖ్యంగా మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, దేవరకొండ, ఆలేరు, భువనగి రి, మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. 

క్లారిటీ ఇవ్వని కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రతి పార్లమెంట్​పరిధిలో జోడో యాత్ర ప్రారంభ సభ పెట్టాలని పార్టీ ఆదేశాలు ఉన్నాయి. ముందుగా నల్గొండ పార్లమెంట్​ వరకే మీటింగ్​ పెట్టాలని అనుకున్నారు. కానీ ఉమ్మడి జిల్లా నేతలంతా కోదాడ సభకు రావాలని గాంధీభవన్​నుంచి, అటు ఉత్తమ్​ కూడా పర్సనల్​గా కాల్​ చేశారని చెబుతున్నారు. గతంలో పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతగా చొరవ చూపించలేదు. దీంతో జోడో యాత్ర సభ భువనగిరి పార్లమెంట్​ సెగ్మెంట్ పరిధిలో పెడ్తారా.. లేదా.. అనే విషయమై నాయకులకు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా నాయకులంతా కోదాడ సభకు రావాలని చెప్పినట్లు పార్టీ సీనియర్​ నేత ఒకరు తెలిపారు. అయితే థాక్రే సభకు వెంకటరెడ్డి వెళ్తారా లేదా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. నల్గొండ నియోజకవర్గంలోని వెంకటరెడ్డి కేడర్​ కూడా కోదాడ వెళ్లేందుకు సిద్ధంగా లేరని సమాచారం. అయితే వెంకటరెడ్డి ముఖ్య అనుచరులు మినహా  భువనగిరి, నల్గొండ ఎంపీ సెగ్మెంట్​ పరిధిలోని ఉత్తమ్, జానా ముఖ్య అనుచరులు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

కోదాడ చేరుకున్న థాక్రే

కాంగ్రెస్ ​పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావ్​ థాక్రే మంగళవారం రాత్రి నల్గొండ జిల్లాకు చేరుకున్నారు. మునగాల మండలకేంద్రంలో పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కోదాడలో హాత్​ సే హాత్​ జోడో యాత్ర పోస్టర్​ను థాక్రే, ఎంపీ ఉత్తమ్​, మాజీ ఎమ్మెల్యే పద్మావతి తదితరులు ఆవిష్కరించారు. 

రేవంత్​యాత్రకు నోఎంట్రీ?

పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో ఉండకపోవచ్చనే చెబుతున్నారు. పార్టీ అగ్రనేతలు ఎవరూ ఆయన రాకను ఇష్టపడటం లేదు. దీంతో కోదాడలో జరిగే మీటింగ్​కు రేవంత్​ అనుచరులు వెళ్తారా లేదా అన్నది కూడా సందేహంగానే ఉంది. నకిరేకల్, సూర్యాపేట, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రేవంత్​టీమ్ బలంగా పని చేస్తోంది. రేవంత్​పాదయాత్రను ఇష్టపడని జిల్లా అగ్రనేతలు ఈ సభకు వెళ్లకుండా తమ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా థాక్రే ఎదుట నిరసన వ్యక్తం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సూర్యాపేట డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పటివరకు ఫైనల్​కాలేదు. నల్గొండ, భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్ల నియామకం జరిగినప్పటికీ జిల్లా కమిటీల కూర్పు ఇప్పటివరకు చేపట్టలేదు. స్థానికంగా ఉన్న సమస్యలను అట్లనే ఉంచి, జోడో యాత్ర సక్సెస్​ చేయడం ఎలా సాధ్యమవుతుందని పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు.