మరోసారి మార్గదర్శి కార్యాలయాలపై సీఐడీ సోదాలు

మరోసారి మార్గదర్శి కార్యాలయాలపై సీఐడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి మార్గదర్శిపై సీఐడీ సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లల్లో సీఐడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలం నుంచి ఖాతాదారుల సొమ్ము మళ్లించినట్టు మార్గదర్శిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిధుల మళ్లింపుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. 

గత కొద్ది రోజుల క్రితమే ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాలపై సీఐడీ, జీఎస్టీ, ఎన్‍ఫోర్స్ మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు బయటకు వచ్చాయని కూడా అధికారులు వెల్లడించారు. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డబ్బును దారి మళ్లిస్తున్నట్టు తేల్చారు. ఆ డబ్బును వడ్డీలకు ఇవ్వడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.