గబ్బిలాల నుంచి పంగోలిన్స్ కు వైరస్.. ఆ తర్వాతే మనుషులకు

గబ్బిలాల నుంచి పంగోలిన్స్ కు వైరస్.. ఆ తర్వాతే మనుషులకు
  • వెయ్యేండ్లకోసారి ఇలా జరగొచ్చు
  • వెల్లడించిన ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: గబ్బిలాల నుంచి కరోనా వైరస్ మనుషులకు రావడమనేది చాలా అరుదు అని, అది వెయ్యేళ్లకు ఒకసారే మాత్రమే జరగొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సైంటిస్టులు చెప్పారు. గబ్బిలాల నుంచి అలుగు(పంగోలిన్స్) లకు సోకిన తర్వాత అది పరివర్తన చెంది మనిషికి అంటి ఉండవచ్చునని చెప్తున్న చైనీయుల పరిశోధనలను వారు గుర్తుచేశారు. కరోనా వైరస్ ప్రపంచం అంతటా విస్తరించిన నేపథ్యంలో ఐసీఎంఆర్ సైంటిస్టు డాక్టర్ గంగా ఖదేకర్ వైరస్ సంక్రమన విధానం గురించిన కొత్త విషయాన్ని గురువారం మీడియాకు చెప్పారు.

గబ్బిలాల్లో జన్యు పరివర్తన ద్వారా వైరస్ వ్యాప్తి చెందిందని వివరించారు. అయితే అది డైరెక్టుగా మనుషులకు వచ్చే చాన్స్ లేదన్నారు. కానీ, గబ్బిలాలు అలుగు జీవులకు ప్రసారం చేసే అవకాశం ఉందని, వాటి ద్వారా వైరస్ హ్యూమన్స్ కు ట్రాన్స్ మిట్ అయుంటుందన్నారు. ‘‘కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మానవులకు సంక్రమించే సంఘటన వెయ్యి సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది కూడా కొన్ని వైరస్ కొన్ని జాతులను మార్చినప్పుడు అరుదుగా జరుగుతుంది”అని డాక్టర్ అన్నారు. ఇండియాలో కొరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వచ్చినట్లు తమకు కనిపించలేదని ఆయన ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. తాము జరిపిన రీసెర్చ్ ప్రకారం రెండు రకాల గబ్బిలాలున్నాయని, అవి మనుషులను ప్రభావితం చేసే స్థాయి సామర్థ్యం కలిగిలేవని తెలిపింది.