సైకిల్​ నుంచి లగ్జరీ కారు!

సైకిల్​ నుంచి లగ్జరీ కారు!

ఒకప్పుడు కనీసం సైకిల్​ని కూడా పూర్తిస్థాయిలో తయారుచేయలేని కంపెనీ ఇప్పుడు లేటెస్ట్​ టెక్నాలజీతో కార్లు తయారుచేస్తోంది. అదే ‘‘కియా” కార్ల కంపెనీ. ఈ కంపెనీని మొదట్లో సైకిళ్లకు వాడే నట్లు, బోల్ట్​లు తయారుచేసేది. ఆ తర్వాత కొన్నాళ్లకు సైకిల్​ తయారీ మొదలుపెట్టింది. తర్వాత మరో కంపెనీ సాయంతో బైక్​ని తెచ్చింది. ఆ సక్సెస్​తో ట్రక్కులు, కార్లు మార్కెట్​లోకి తీసుకొచ్చి టాప్​ కంపెనీల లిస్ట్​లో చేరింది. 

కియా కంపెనీ జర్నీ1944లో మొదలైంది. అప్పుడు కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితమైన కియా ప్రొడక్ట్స్​ ఇప్పుడు ప్రపంచమంతా వాడుతున్నారు. ఎన్నో దేశాలకు విస్తరించిన ఈ కంపెనీని కిమ్ చుల్ హో మొదలుపెట్టాడు. కిమ్​1905లో సౌత్​ కొరియాలో పుట్టాడు. చిన్నప్పుడు తల్లి చనిపోయింది. దాంతో కిమ్​ని తీసుకుని అతని తండ్రి జపాన్​ వెళ్లిపోయాడు. అక్కడ ఒక చిన్న కర్మాగారంలో పనిచేస్తూ.. కిమ్​ని చదివించాడు. కానీ.. అతనికి వచ్చే జీతం చాలా తక్కువ. దాంతో మధ్యలోనే చదువు మానేసి,18 ఏండ్ల వయసులో ఒక స్టీల్​ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు కిమ్​. ట్రక్కుల్లో వచ్చే ముడి ఇనుముని కిందికి దించి, ఫ్యాక్టరీ లోపలికి తీసుకెళ్లడం అతని పని. కిమ్​ చిన్నప్పటినుంచి ఏ పనిచేసినా చాలా స్మార్ట్​గా చేసేవాడు. అలాగే ఈ కంపెనీలో కూడా పనిచేశాడు. దాంతో పై అధికారులు అతని పనికి మెచ్చి, కొన్ని రోజులకే ప్రమోషన్​ ఇచ్చారు. ఆ తర్వాత కంపెనీలో జరిగే అన్ని పనులు నేర్చుకున్నాడు. ప్రతి మెషిన్​ గురించి కొంత నాలెడ్జ్​ సంపాదించాడు. కంపెనీలో మంచి పొజిషన్​కు వచ్చాడు. కానీ..1929లో కొన్ని కారణాల వల్ల జపాన్​లో చాలా కంపెనీలు మూతపడ్డాయి. కిమ్​ పనిచేసే కంపెనీ కూడా ప్రొడక్షన్​ ఆపేసింది.

సొంతంగా బిజినెస్​

ఉద్యోగం పోయి ఖాళీగా ఉంటున్న టైంలో తను అప్పటివరకు పనిచేసిన కంపెనీ ఓనర్​ని కలిశాడు కిమ్​. వాస్తవానికి ఏదైనా పని ఉంటే ఇప్పించమని అడగడానికి వెళ్లాడు. కానీ.. వాళ్ల ఓనర్​కి కిమ్​ మీద ఉన్న నమ్మకంతో నట్లు, బోల్ట్​లు తయారుచేసే చిన్న యూనిట్​ పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అందుకు కావాల్సిన ఆర్థిక సాయం కూడా అతనే చేశాడు. అలా.. 1930లో జపాన్‌‌లో నట్లు, బోల్ట్​లు తయారుచేసే కంపెనీ మొదలైంది. కిమ్​ చాలా కష్టపడి కంపెనీని నిలబెట్టుకోగలిగాడు. తొమ్మిదేండ్లు గడిచిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం రూపంలో1939లో మరో విపత్తు వచ్చింది. దాంతో జపాన్​లో ఉండలేక కంపెనీ మూసేసి సొంత దేశం కొరియా వెళ్లిపోయాడు. జపాన్​లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో అక్కడే 1944లో సైకిల్ విడి భాగాలను తయారుచేయడం మొదలుపెట్టాడు. తన కంపెనీకి ‘క్యున్​సంగ్​ ప్రెసిషన్​ ఇండస్ట్రీ’ అని పేరు పెట్టాడు. ఈ కంపెనీ చాలా తక్కువ టైంలోనే బాగా డెవలప్ అయింది. అతను ప్రొడ్యూస్​ చేసిన విడి భాగాలను ఇతర దేశాలకు కూడా ఎక్స్​పోర్ట్​ చేశాడు.1950లో నార్త్​ కొరియా, సౌత్​ కొరియా మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఆయనకు మాత్రం మంచే చేసింది. యుద్ధం వల్ల దేశంలో సైకిళ్లకు బాగా డిమాండ్​ పెరిగింది. అప్పటివరకు విదేశాల నుంచే ఎక్కువ సైకిళ్లను దిగుమతి చేసుకునేది కొరియా. దాంతో1951లో సైకిళ్ల ప్రొడక్షన్​ని మొదలుపెట్టాడు. తన సైకిళ్లను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేశాడు.

 

కియా..  ​ 

సైకిళ్ల బిజినెస్​ బాగానే ఉన్నా.. టెక్నాలజీ బాగా పెరిగింది. బైక్​ల వాడకం మొదలైంది. అందుకే కంపెనీని కూడా అప్​గ్రేడ్​ చేయాలి అనుకున్నాడు కిమ్​. దాంతో మోటార్​ బైక్​ల ప్రొడక్షన్​ మొదలుపెట్టాలి అనుకున్నాడు. కానీ.. ఆ ఇండస్ట్రీలో అతనికి అంత అనుభవం లేదు. పైగా అందుకు కావాల్సిన టెక్నాలజీ కూడా కంపెనీ దగ్గర లేదు. దాంతో జపాన్​కి చెందిన​ హోండా కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. అప్పుడే కంపెనీ పేరుని కియాగా మార్చి, కియాహోండా పేరుతో కొరియా మార్కెట్​లోకి బైక్​ని తీసుకొచ్చాడు. అది ఫుల్ సక్సెస్​ అయ్యింది. చాలామంది దాన్ని ఎగబడి మరీ కొన్నారు. కిమ్​ అక్కడితో ఆగిపోలేదు. బైక్స్​ తయారు చేయగలిగాం... కార్లు, ట్రక్కులు చేయలేమా? అనుకున్నాడు. అందుకే మరో కంపెనీ పార్ట్​నర్​షిప్​తో మూడు చక్రాలుండే ఒక ట్రక్​ని తెచ్చాడు. 

కే–360

కియా కంపెనీ 1962లో తీసుకొచ్చిన కే–360 ఆ దేశంలోనే మొదటి మూడు చక్రాల వెహికల్. దాని సేల్స్​ కూడా బాగానే ఉన్నాయి. ఈ వెహికల్​తో కియా కొరియా మోటర్​ ఇండస్ట్రీలో నెంబర్​వన్​ కంపెనీగా ఎదిగింది. కే–360 ట్రక్​ కొరియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. దాని ఇంజిన్ కెపాసిటీ 356 సీసీ, బరువు 485 కిలోలు. గంటకు 65 కిలోమీటర్లు పరిగెత్తుతుంది. ఈ వెహికల్​ ఇచ్చిన సక్సెస్​తో కియా కంపెనీ మరుసటి ఏడాదే దాని అప్‌‌గ్రేడ్ వెర్షన్‌‌ను పరిచయం చేసింది. అదే టీ-600. దీని ఇంజిన్ కెపాసిటీ1,484సీసీ, బరువు 1,480 కిలోలు. కాకపోతే.. ఇది పెద్దగా సక్సెస్​ కాలేదు. ఆ తర్వాత కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది ఈ కంపెనీ. 

ప్యాసింజర్​ కార్లు

అప్పటివరకు కొరియాలో జపాన్​ కంపెనీల కార్లే ఎక్కువ కనిపించేవి. డిమాండ్​ కూడా వాటికే బాగా  ఉండేది. అందుకే కిమ్​ ప్యాసింజర్ల కార్ల తయారీలోకి దిగి, తక్కువ ధరకు కార్లను అందించాలని డిసైడ్​ అయ్యాడు. అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాడు. చివరికి కారు తయారీ మొదలైంది. కానీ.. అది లాంచ్​ చేసేలోపే కిమ్​ చనిపోయాడు. కిమ్​ చనిపోయేనాటికే కంపెనీ పది కాలాల పాటు నిలబడేంత గట్టి పునాదులు నిర్మించాడు. ఆ పునాదుల మీద ఆయన వారసులు కొత్త కంపెనీలు కూడా కట్టారు. కంపెనీకి ఇంటర్నేషనల్​ మార్కెట్​లో మంచి గుర్తింపు తీసుకొచ్చారు. 

భారీ నష్టాలు 

కియా కంపెనీ1974లో ప్యాసింజర్​ కార్​ ‘బ్రిసా’ని లాంచ్​ చేసింది. అమ్మకాలు కూడా జరిగాయి. కానీ..  ప్రభుత్వం పెట్టిన కొన్ని ఆంక్షల వల్ల 1981లో ప్యాసింజర్​ కార్ల అమ్మకాలను ఆపేయాల్సి వచ్చింది. దాంతో విపరీతంగా నష్టాలు రావడం మొదలైంది. మళ్లీ కంపెనీకి లాభాలు తెచ్చేందుకు ప్రతి ఉద్యోగి చాలా కష్టపడ్డారు. ట్రక్​ల అమ్మకాలు పెంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగి యూనిఫాంపై మినీ వ్యాన్ లోగో ప్రింట్​ చేయించుకున్నారు. ‘‘గుడ్ మార్నింగ్’’ అని చెప్పుకోవడానికి బదులుగా ఉద్యోగులు ప్రతి రోజు ఒకరికొకరు ‘‘వ్యాన్​ను అమ్మేద్దాం’’ అని  వాళ్ల భాషలో చెప్పుకునేవాళ్లు. అంత కష్టపడి పనిచేసినందువల్లే మళ్లీ మార్కెట్​​లో నిలబడగలిగింది కియా. 

మళ్లీ మొదలు

ప్యాసింజర్​ కార్ల తయారీ కోసం1985లో  మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది కంపెనీ. ఈసారి  ఫోర్డ్ కంపెనీతో ఒప్పందం చేసుకుని కార్లు తయారుచేసింది. చాలా తక్కువ టైంలోనే కొరియా ప్యాసింజర్ కారు మార్కెట్‌‌లో కియా వాటా 30 శాతానికి చేరుకుంది. ఒకే సంవత్సరంలో దాదాపు ఆరు లక్షల యూనిట్లను తయారుచేసింది. తర్వాత దక్షిణ కొరియాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి పెద్ద మార్కెట్​లలో కూడా నిలదొక్కుకుంది. అమెరికాలో1992లో అమ్మకాలు మొదలుపెట్టిన కియా మూడేండ్లలోనే 30 రాష్ట్రాలకు విస్తరించింది. 1995 నాటికి కియా ఫ్యామిలీలో అమెరికా నుంచి వంద మంది డీలర్లు చేరారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాంతో కియా మళ్లీ దివాలా తీసింది. దాంతో హ్యుండాయ్ మోటార్స్​ కియాలోని చాలా షేర్లను కొనేసింది.

 

ప్రస్తుతం 

ఇప్పటికీ కియా మార్కెట్​లో ఉన్న తన కాంపిటీటర్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం కియాకు ఎనిమిది దేశాల్లో 14 మాన్యుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్​ యూనిట్లు ఉన్నాయి. ఏడాదికి1.4 మిలియన్ వెహికల్స్​కు పైగా తయారుచేస్తోంది. దాదాపు172 దేశాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. దాదాపు మూడువేల కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఉన్నారు. కియా కంపెనీలో 40,000లకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.