నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు! లిస్ట్ సిద్ధం చేసిన రెవెన్యూ శాఖ.. లావాదేవీలు జరపకుండా లాక్ చేసేలా ప్రతిపాదనలు

నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు! లిస్ట్ సిద్ధం చేసిన రెవెన్యూ శాఖ.. లావాదేవీలు జరపకుండా లాక్ చేసేలా ప్రతిపాదనలు
  • అందులోనే అన్ని రకాల ప్రభుత్వ భూములు.. 
  • పట్టాపాస్ బుక్‌‌లేని వ్యవసాయ భూములు 
  • హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి చేరనుంది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌‌ను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయి సమాచారంతోపాటు భూ భారతి పోర్టల్‌‌లో ఉన్న  ఈ మొత్తం భూమిని లావాదేవీల నిమిత్తం లాక్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో ప్రభుత్వ భూములతోపాటు కొన్ని ప్రైవేట్ పట్టా భూములు కూడా ఉన్నాయి. 

హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర  ప్రభుత్వం ఈ జాబితాను సిద్ధం చేసింది,   నిషేధిత జాబితాలోకి చేర్చడానికి ప్రతిపాదించిన భూమిని 3 ప్రధాన కేటగిరీలుగా విభజించారు. ఇందులో ప్రభుత్వ, నాలా,  పట్టా పాస్‌‌బుక్   జారీ చేయని వ్యవసాయ భూములున్నాయి. ప్రభుత్వ భూముల్లో వివిధ శాఖలకు కేటాయించిన భూములతోపాటు  అసైన్డ్​ ల్యాండ్స్, అటవీ భూములు,  నీటిపారుదల ప్రాజెక్టులకు, రోడ్లకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు కేటాయించిన భూములు,  ఇంటి స్థలాలు మొదలైన రూపంలో ఉన్న ప్రభుత్వ భూముల విస్తీర్ణం దాదాపు 77 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలిసింది.  

ఇది కాకుండా పార్ట్​ బీలో పట్టా భూములు కొన్ని ఉన్నాయి. ఆ విస్తీర్ణం కూడా కలిపితే రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాలు నిషేధిత జాబితా భూముల్లో ఉండనుంది. వీటిపై పూర్తి అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. ఎలాంటి లావాదేవీలు చేయాలన్నా, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి బదలాయింపు చేయాలన్నా కచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందే.  ఈ నిషేధిత జాబితా.. ప్రభుత్వ భూములను కాపాడటంలో, అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టడంలో కీలకంగా ఉంటుంది.  దీని అమలుతో రాష్ట్రంలో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.

పట్టా పాస్‌బుక్​ లేనివి 18 లక్షల ఎకరాలపైనే..

ప్రభుత్వ భూముల తర్వాత నిషేధిత జాబితాలో  మరో కేటగిరీ పట్టా పాస్‌బుక్ జారీ చేయని వ్యవసాయ భూములు.  ఈ కేటగిరీ కింద 18 లక్షల ఎకరాల పైన భూమి ఉంది. దీనికి సంబంధించి 11 లక్షలకుపైగా  ఖాతాలున్నాయి. భూ భారతిలో లావాదేవీలు జరగాలంటే పాస్‌బుక్ తప్పనిసరి కాబట్టి.. ఈ భూములు కూడా ప్రస్తుతానికి నిషేధిత జాబితాలో కొనసాగనున్నాయి.  నాలా భూములు అంటే  వ్యవసాయ భూములను కన్వర్ట్​ చేసుకున్న  విస్తీర్ణం 3 లక్షల  ఎకరాల పైగా ఉన్నది.  నిషేధిత భూముల జాబితా అస్తవ్యస్తంగా ఉండటంపై గతంలో హైకోర్టు పలు సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భూమికి సంబంధించిన అన్ని రికార్డులను క్షేత్రస్థాయి నుంచిసేకరించి, అత్యంత పారదర్శకంగా ఒక సమగ్ర జాబితాను రూపొందించాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ.. జిల్లా స్థాయి నివేదికలు,  సమగ్ర నివేదికను భూ భారతి పోర్టల్‌ ఆధారంగా సిద్ధం చేసింది.  

లావాదేవీలు జరపకుండా లాక్!

నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగకుండా నిరోధించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మొత్తం భూమిని భూ భారతి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో శాశ్వతంగా లేదా తాత్కాలికంగా లాక్ చేసే ప్రతిపాదనలను సిద్ధం చేసింది.  ఇప్పటికే వీటిలో చాలా భూములు ఆ జాబితాలోనే ఉన్నాయి. అయితే, కోర్టు ఆదేశాలతో మళ్లీ అన్ని రకాలుగా పరిశీలించి.. కొత్త జాబితా సిద్ధం చేశారు. దీంతో  ప్రభుత్వ భూములను లేదా వివాదాస్పదంగా ఉన్న ప్రైవేట్ భూములను ఇతరుల పేరు మీద రిజిస్టర్ చేయడం అసాధ్యమవుతుంది. 

]భూ భారతి పోర్టల్‌లో భూమి విస్తీర్ణం 2.50 కోట్ల ఎకరాల పైన ఉన్నది. ఇందులో 1.53 కోట్లఎకరాల వ్యవసాయ భూమికి పట్టా పాస్‌బుక్‌లు జారీ చేశారు. ఈ భూమి చట్టబద్ధమైన లావాదేవీలకు అందుబాటులో ఉంటుంది. అయితే, పట్టా పాస్‌బుక్ జారీ చేయని పార్ట్ బీ, ప్రభుత్వ భూములు, నాలా భూములు, అటవీ, ఎండోమెంట్​ ఇతర శాఖల కింద ఉన్న భూములు, ఇతరత్రా వంటివి దాదాపు కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి చేరుతుంది.