నీటి కరువు తీర్చే  కోటిరూపాయల బావి

నీటి కరువు తీర్చే  కోటిరూపాయల బావి

చాలామంది రైతులు ‘మా దగ్గర నీటి కరువు ఉంది. సంవత్సరానికి ఒకే పంట వేయగలుగుతున్నాం. పంటకు నీళ్లు సరిపోక దిగుబడి రావట్లేదు’ అని బాధ పడుతుంటారు. అలాంటి వాళ్లందరికీ తనే ఆదర్శం. ‘ఇలాంటి కరువు నుండి బయటపడే ఉపాయం నా దగ్గర ఉంది’ అంటున్నాడు మారుతి బజ్‌‌గుడే. 
మారుతి కూడా ఒక రైతే. ఊరు మహారాష్ట్ర, బీడ్‌‌ జిల్లాలోని పడల్‌‌సింగి. పదిహేను ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఆ ఊర్లో నీటి కరువు ఎక్కువ. అందుకే అక్కడి భూములన్నీ దాదాపు బీడు భూములే. ఒక రోజు మారుతికి... తనకున్న భూమిలో పెద్ద బావి తవ్విస్తే నీటి కరువు పోతుందనే ఆలోచన వచ్చింది. నీళ్లు పడతాయో? లేదో? అన్న అనుమానం వచ్చినా లెక్కచేయలేదు. ‘ఏదైతే అది అయింది. బావి తవ్వించే తీరుతా’ అని అనుకున్నది చేసి చూపించాడు.

ఎకరా విస్తీర్ణంలో ఉన్న ఆ బావి గురించి... భార్య నగలు అమ్మేసి...

మారుతికి వ్యవసాయమే కాకుండా మండపాల డెకరేషన్ బిజినెస్‌‌ కూడా ఉంది. ఎప్పటినుండో ఉన్న బిజినెస్‌‌ కాబట్టి అందులో వచ్చిన కొంత డబ్బును దాచుకున్నాడు. నేషనల్‌‌ హైవే పక్కన ఉన్న వ్యవసాయ భూమి ఇతనిది. అందుకే రోడ్డు వెడల్పు చేసినపుడు కొంత భూమి పోయింది. అందులో వచ్చిన నష్ట పరిహారం, బ్యాంక్‌‌ సేవింగ్స్ మొత్తం కలిపి కోటి రూపాయల్లో బావి తవ్వడం పూర్తి అవుతుందని లెక్కలేసుకున్నాడు. ఊళ్లో వాళ్లు, ఇంట్లో వాళ్లు వద్దని ఎంత చెప్పినా వినకుండా బావి తవ్వించడం మొదలుపెట్టాడు. తవ్వకాల్లో దొరికిన మట్టిని పక్కన జరుగుతున్న హైవే నిర్మాణానికి, రాళ్లను కంకరరాళ్ల క్రషర్‌‌‌‌లకు అమ్మేశాడు. అవి అమ్మగా వచ్చిన డబ్బు కూడా బావి తవ్వడానికి ఉపయోగపడింది. బావి తవ్వడానికి మూడు ప్రొక్లైనర్లు, పది ట్రక్కులు కావాల్సివచ్చింది. రోజులు గడుస్తున్నాయి. బావిలో నీళ్లు పడకపోవడంతో ఇంకా లోతు తవ్వాల్సివచ్చింది. అనుకున్న దానికన్నా ఖర్చు పెరిగింది. దాంతో భార్య నగలు అమ్మాడు మారుతి. అప్పటి నుండి భార్య అతనితో మాట్లాడటం మానేసింది. జరుగుతున్న పనుల్ని ఊరి ప్రజలందరు వచ్చి వింతగా చూసేవాళ్లట. ఏదైతేనేం మొత్తం కోటీ యాభై లక్షల ఖర్చుతో బావి తవ్వడం పూర్తయింది. 41 అడుగుల లోతు, 202 అడుగుల వ్యాసంలో ఉంది ఈ బావి. 10 కోట్ల లీటర్ల నీళ్లు ఉన్న ఈ బావి వల్ల వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఒక వేళ కరువు వచ్చినా... భయం లేదు. ఆ బావి నీళ్లతోనే  12 ఎకరాలకు కావల్సినన్ని నీళ్లు అందించి సాగు చేసుకోవచ్చు అంటున్నాడు మారుతి.

టూరిస్ట్‌‌ స్పాట్‌‌ అయింది

బీడ్‌‌ జిల్లా కంకాళేశ్వర ఆలయం, ఖజానా బావడీ లకు (పురాతన బావి) ప్రసిద్ధి. అవి చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరు మారుతి తవ్విన బావి చూడ్డానికి కూడా వస్తున్నారట. వాటితో పాటు ఈ బావి కూడా ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‌‌గా మారింది. 

పండ్ల తోటలు పెంచుతున్నా

‘గతంలో నీళ్లు లేక మా భూమి ఎండిపోయి ఉండేది. ఇప్పుడు కావాల్సినన్ని నీళ్లున్నాయి. నచ్చిన పంట వేసుకుంటున్నా. అందుకే పండ్లతోటలు సాగు చేస్తున్నా. ఎనిమిది ఎకరాల్లో బత్తాయి, పుచ్చకాయ, జామ తోటలను పెంచుతున్నా. వానలు ఎప్పుడు పడతాయో తెలియదు. 
కాబట్టి వాన కోసం ఎదురుచూడకుండా పక్క పక్క భూములున్న కొంతమంది రైతులు కలిసి ఇలా బావులు తవ్వుకుంటే పంటకు కావాల్సినన్ని నీళ్లు అందుతాయి. కరువు పోతుంది’ అంటున్నాడు మారుతి.