4 నెలల్లో బీఆర్ఎస్​కు వంద మంది కీలక నేతలు గుడ్​బై

4 నెలల్లో బీఆర్ఎస్​కు వంద మంది కీలక నేతలు గుడ్​బై
  • పార్టీ మారిన వాళ్లలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా.. మారని పార్టీ పెద్దల మాట తీరు
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్​లో ఉన్నారంటున్న కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కీలక నేతలంతా బీఆర్ఎస్​కు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరుతున్నారు. నాలుగు నెలల్లో సుమారు వంద మందికి పైగా ముఖ్యనేతలు కారు దిగారు. వీరిలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్​చైర్మన్లు ఉన్నారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పి కాంగ్రెస్​లోకి చేరేందుకు సిద్ధమయ్యారు.

ఇదేబాటలో మరికొందరు బీఆర్​ఎస్ ను​ వీడి, కాంగ్రెస్​లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా.. ఆ పార్టీ పెద్దల మాట తీరు మాత్రం మారడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్​లో ఉన్నారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విడిచి ఎవరూ వెళ్లొద్దని, పోతే మళ్లీ చేర్చుకునేది లేదని కేసీఆర్ చేస్తున్న హెచ్చరికలను కూడా బీఆర్ఎస్ లీడర్లు ఖాతరుచేయడం లేదు. అసలు పార్టీని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం మానేసి... ప్రభుత్వం కూలిపోతుందనడం, ఏడాది తిరగకుండానే ఎన్నికలొస్తాయని, అధికారంలోకి వస్తామని ప్రకటన చేయడం  సొంత పార్టీ నేతలను విస్మయానికి గురి చేస్తున్నది. 

20 మందికిపైగా మున్సిపల్ చైర్మన్లు బయటికి

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌‌కు గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు, ఓటు బ్యాంక్ బలంగా ఉండేది. తెలంగాణ వచ్చాక టీడీపీని దెబ్బకొట్టిన కేసీఆర్‌‌‌‌, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశారు. రెండు సార్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ప్రచారంలో గ్రామ, మండల స్థాయి లీడర్లు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వాళ్లే పార్టీని వీడి వెళ్లిపోతుంటే పట్టించుకునేవారు కరువయ్యారు. గడిచిన నాలుగు నెలల్లో 20 మందికిపైగా మున్సిపల్ చైర్మన్లు, ఆరుగురు జడ్పీ చైర్మన్లు సహా పెద్ద సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్‌‌‌‌ఎస్‌‌కు గుడ్‌‌బై చెప్పేసి, ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇంకా ఈ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.

పార్టీని వీడిన కీలక నేతల్లో కొందరు.. సిట్టింగ్ ఎంపీలు: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, నాగర్‌‌‌‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌‌, ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడం నగేశ్.

మాజీ ఎమ్మెల్సీలు: నేతి విద్యా సాగర్, ఆకుల లలిత, డి.రాజేశ్వర్, సంతోష్ కుమార్, వేనేపల్లి చందర్ రావు (కోదాడ), పురాణం సతీశ్, సంతోష్​కుమార్​.

మాజీ మంత్రులు:  బోడ జనార్దన్, నేరెళ్ల ఆంజనేయులు,  ఇనుగాల పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు.  కొంతకాలంగా  బీఆర్ఎస్​కు దూరంగా ఉంటున్న  మాజీ మంత్రి ఐకేరెడ్డి కాంగ్రెస్​ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.  కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి కూడా బీఆర్​ఎస్​ను వీడారు. 

మాజీ ఎమ్మెల్యేలు: నల్లాల ఓదెలు,  కోనేరు కోనప్ప (సిర్పూర్–టీ), రాములు నాయక్ (వైరా), చిలుముల మదన్ రెడ్డి (నర్సాపూర్), గడ్డం అర్వింద్ రెడ్డి(మంచిర్యాల), ఆరేపల్లి మోహన్(మానకొండూర్​), కోడూరి సత్యనారాయణ గౌడ్(చొప్పదండి),  రేఖ నాయక్ (ఖానాపూర్), విఠల్ రెడ్డి (ముథోల్), ఆరూరి రమేశ్ (వర్ధన్నపేట), రాథోడ్ బాపురావు (బోథ్), శానంపూడి సైదిరెడ్డి (హుజూర్ నగర్).

చేజారుతున్న ఎమ్మెల్యేలు

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బీఆర్‌‌‌‌ఎస్ బలం 38కి తగ్గింది. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్‌‌లో చేరారు.

తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌‌గౌడ్‌‌ సీఎం రేవంత్‌‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌‌లో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఓ వైపు ఇలా పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌‌లోకి పోతుంటే, కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌‌‌‌ఎస్‌‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ గురువారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ స్టేట్‌‌మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్‌‌మెంట్‌‌ వల్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌కు కలిగే లాభం కంటే, నష్టమే ఎక్కువ అని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.