10 మంది ఇండియన్లలో ఒకరికి కేన్సర్

10 మంది ఇండియన్లలో ఒకరికి కేన్సర్

ప్రపంచవ్యాప్తంగా ఏ రోగం వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారో తెలుసా? గుండెజబ్బుల వల్లే. హార్ట్ డిసీజెస్ తర్వాత ఎక్కువ మందిని బలి తీసుకుంటున్న రోగం కేన్సరే. మనదేశం విషయానికి వస్తే మోస్ట్ డేంజరస్ రోగం మాత్రం కేన్సరేనట. జీవితకాలంలో దాదాపు ప్రతి10 మంది ఇండియన్లలో ఒకరు కేన్సర్ బారిన పడొచ్చట. ప్రతి15 మంది ఇండియన్లలో ఒకరు కేన్సర్ వల్లే చనిపోయే ప్రమాదం ఉందట. మంగళవారం వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో), దాని అనుబంధ సంస్థ ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్సీ)’ ఈ మేరకు రెండు నివేదికలను విడుదల చేశాయి. 

ప్రజల లైఫ్ స్టైల్, ఆర్థిక స్థితి బాలే.. 

దేశంలో పొగాకు వాడకం వల్ల హెడ్, నెక్ కేన్సర్ల ముప్పు పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ముఖ్యంగా మగవాళ్లలో ఓరల్ కేన్సర్, ఆడవాళ్లలో గర్భాశయ కేన్సర్లు పెరుగుతున్నాయని తెలిపింది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితి (సోషియో ఎకానమిక్ స్టేటస్) చాలా దిగువ స్థాయిలో ఉండటమే ఈ రెండు రకాల కేన్సర్లకు కారణమని పేర్కొంది. ప్రజల అధిక బరువు, స్థూలకాయం, శారీరక శ్రమ తక్కువ కావడం, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం (సెడెంటరీ లైఫ్​స్టైల్)తో పాటు ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే కేన్సర్ల ముప్పు పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

దేశం ఆర్థిక వృద్ధిని సాధించినా..

గత రెండు దశాబ్దాల్లో ఇండియా స్థిరంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తూ వస్తోంది. చాలా సార్లు ఏటా 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఆర్థిక వృద్ధి వల్ల సామాజిక, ఆర్థికపరంగా మార్పులు చాలా వచ్చాయి. దీనివల్ల కూడా కేన్సర్, ఇతర నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు పెరిగాయి. కేన్సర్ కేసులకు, కంట్రోల్ సర్వీసులకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే 20 ఏళ్లలో కేన్సర్ కేసులు 60% పెరుగుతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అల్ప, మధ్య స్థాయి ఆదాయం ఉన్న దేశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప కేన్సర్ కేసులు తగ్గవని స్పష్టం చేసింది.

మన దేశంలో 6.9 కోట్ల మంది స్మోకర్లు

‘‘ప్రపంచవ్యాప్తంగా స్మోకర్లలో 80% మంది అల్ప, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. రోజూ స్మోక్ చేసేవారిలో 64% మంది 10 దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచ మేల్ స్మోకర్లలో ఏకంగా 50% మంది ఇండియా, చైనా, ఇండోనేసియాలోనే ఉన్నారు”అని నివేదిక తెలిపింది. ఇక మనదేశంలో దాదాపు 6.9 కోట్ల మంది సిగరెట్​ తాగితే, 10.64 కోట్ల మంది నమిలే పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారట.

బ్రెస్ట్ కేన్సర్ పెరుగుదల 2.8 శాతం

దేశవ్యాప్తంగా బ్రెస్ట్ కేన్సర్ ఏటా 1.4% నుంచి 2.8%కి పెరిగిందని నివేదిక తెలిపింది. దీనితో పాటు పెద్ద పేగు కేన్సర్ కూడా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో పెరుగుతోందని పేర్కొంది. సర్వికల్ కేన్సర్ విషయంలో ఇండియా ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందట.

కేన్సర్ రాకూడదంటే ఏంచేయాలి..?

శరీరంలో కణాలు కంట్రోల్ లేకుండా రెట్టింపు అవుతూ ట్యూమర్ గా మారడాన్నే కేన్సర్ అంటారు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. సకాలంలో గుర్తించి, ట్రీట్ మెంట్ తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. కేన్సర్ ను కలిగించే విషపదార్థాలున్న గాలిని పీల్చడం, ఫుడ్ తీసుకోవడం, స్మోకింగ్, పొగాకు నమలడం వంటి వాటిని వదిలేయాలి. మంచి లైఫ్ స్టైల్, ఫుడ్ అలవాట్లను ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.