మూగబోయిన గొంతులో నుంచి మళ్లీ మాటలు

మూగబోయిన గొంతులో నుంచి మళ్లీ మాటలు

ఆరేళ్ల వయస్సులో గొంతు మూగబోయింది. 12 ఏళ్లుగా మూగమ్మాయిగానే బతికింది. చిన్న వయస్సులోనే అందరిలాగా మాట్లాడ లేకపోయింది. మనస్సులో తనకు తానే కుమిలిపోయింది. కానీ వారం రోజుల కిందట అద్భుతం జరిగింది. మూగబోయిన గొంతులో నుంచి మళ్లీ మాటలు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతని చూసేందుకు గ్రామానికి తరలివస్తున్నారు. 

భీంగల్ మండలం మెండోరా గ్రామంలో సుజాత కుటుంబం నివాసం ఉంటోంది. ప్రస్తుతం ఆమె  వయస్సు 19  ఏళ్లు.  6 ఏళ్ళ వయస్సులో మాటపడిపోయింది. చిన్నప్పుడు చక్కగా మాట్లాడే సుజాత చదువులోనూ ముందుండేది. ఒక్కసారిగా మాట బంద్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనేకమంది డాక్టర్లకు చూపించి మందులు వాడినా సుజాతకు మాటలు రాలేదు. మూగ అమ్మాయిగానే స్కూలుకు వెళ్లి టెన్త్, ఇంటర్ పూర్తి చేసింది. ఇక జీవితాంతం తమ కూతురు మూగదానిలాగే జీవించాల్సి వస్తుందని భావించారు తల్లిదండ్రులు. 12 ఏళ్ల తర్వాత వారం రోజుల కిందట సుజాతకు మాటలు రావడంతో పేరెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

గతంలో తాను ఎంత ప్రయత్నించినా నోటి నుంచి మాట వచ్చేది కాదని సుజాత పేర్కొంది. తోటి విద్యార్థులు తనను చూసి మూగదని చెప్పుకుంటుంటే బాధ పడేదానన్ని కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు మాటలు రావడంతో తానే నమ్మలేకపోతున్నాని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుజాత మాట్లాడటం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో తాము అనేకసార్లు  ప్రయత్నం చేసినా మాట్లాడలేకపోయేదని చెబుతున్నారు. విషయం తెలిసిన బంధువులు, గ్రామస్థులు వచ్చి సుజాతను పలకరించి వెళుతున్నారు. సుజాతకు సహజ సిద్ధంగా మాటలు వచ్చాయని డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయంటున్నారు.