అమ్మాయి ఫేక్ ప్రొఫైల్ తో లక్షలు వసూలు

అమ్మాయి ఫేక్ ప్రొఫైల్ తో లక్షలు వసూలు

జ్యోతినగర్, వెలుగు : తెలుగు మ్యాట్రిమోనిలో ఓ అమ్మాయి ఫొటో, ఫేక్ ప్రొఫైల్ ​పెట్టి పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ శాంతినగర్ కు చెందిన ఒకరి దగ్గర లక్షలు వసూలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ ​చేశారు. ఎన్టీపీసీ పీఎస్​లో ఈ వివరాలను పెద్దపల్లి డీసీపీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడకు చెందిన కోమలి సూర్య ప్రకాశ్( 30 ) జూదం, జల్సాలకు అలావాటు పడి మ్యాజిక్ ​కాల్ ​యాప్​తో ఆడవారి గొంతుతో మాట్లాడుతూ మోసాలు చేసేవాడు. ఇతడు తెలుగు మాట్రిమోనిలో దివ్య శ్రీ పేరుతో ఓ అమ్మాయి ఫొటో పెట్టి తప్పుడు వివరాలు నమోదు చేశాడు. పెండ్లి కోసం చూస్తున్న ఎన్టీపీసీకి చెందిన మూడెత్తుల సురేష్ యాదవ్ ఈ ప్రొఫైల్ ​చూసి రిక్వెస్ట్ ​పంపించాడు. దీంతో సూర్యప్రకాశ్​దివ్యశ్రీ పేరుతో చాట్​చేయడం మొదలుపెట్టాడు.  తర్వాత తన ఫోన్​ నంబర్​ ఇచ్చాడు. అయితే సూర్యప్రకాశ్​ నార్మల్​ కాల్​ మాట్లాడకుండా ​మ్యాజిక్ ​కాల్​ యాప్​తో ఒకసారి దివ్యశ్రీ తండ్రినంటూ, మరోసారి అమ్మను అంటూ, చెల్లెలు, అక్కలా గొంతు మార్చి మాట్లాడేవాడు. తన కుటుంబసభ్యులు పెండ్లికి ఒప్పుకున్నారని నమ్మించాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని, హాస్పిటల్​కు తీసుకువెళ్లాలని, ఇలా పలు కారణాలు చెబుతూ సురేశ్​నుంచి తన అకౌంట్​కు నెలరోజుల్లో రూ.8 లక్షలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు.

విజయవాడకు పిలిచి ఫోన్​ స్విచ్ఛాప్ పెట్టడంతో..  

అయితే వాట్సాప్ ​కాల్​ మాట్లాడాలని సురేశ్ ​అడుగుతున్నా దాటవేస్తూ వచ్చేవాడు. ఒకసారి విజయవాడకు రమ్మని పిలిచి ఫోన్​ స్విచ్ఛాప్ పెట్టుకున్నాడు. దీంతో సురేశ్​ కు అనుమానం వచ్చింది. మళ్లీ ఒకరోజు ఫోన్​ చేసి గోవాకు వెళ్దామని, తన బాబాయి వస్తాడని అతడికి రూ. 2 లక్షలు ఇవ్వాలని సూర్యప్రకాశ్​ కోరాడు. దీనికి ఒప్పుకున్నట్టు నటించిన సురేశ్ ​ఎన్టీపీసీకి పంపించాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూర్యప్రకాశ్​ అతడి బాబాయిలా ఈ నెల 29న గౌతమినగర్ చౌరస్తాకు వచ్చాడు. ఫోన్​ చేయగా అటోలో ఉన్న సూర్య ప్రకాశ్​(దివ్య శ్రీ )ని చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి దగ్గర రూ.14 లక్షలను సీజ్ చేశారు. ఇలాగే ఒడిసాకు చెందిన ఓ ఆర్మీ జవాన్​నుంచి సూర్యప్రకాశ్​ రూ.12 లక్షలు వసూలు చేశాడని డీసీపీ చెప్పారు. నిందితుడిని  పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్,రామగుండం సీఐ కణతల లక్ష్మీనారాయణ.ఎన్టీపీసీ ఎస్సై జీవన్, ఎస్ఐ కుమార్ ఉన్నారు.