ఉద్యోగాలు ఎక్కడ.. 50వేల కొలువుల ప్రకటనకు ఏడాది

 ఉద్యోగాలు ఎక్కడ.. 50వేల కొలువుల ప్రకటనకు ఏడాది
  •  2020 డిసెంబర్ 13న సీఎస్​కు 
  • సీఎం కేసీఆర్ ఆదేశాలు
  • ఖాళీలు గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు 
  • ఇవ్వాలని నిరుడు ఇదే రోజున ఆదేశం
  • ప్రతి ఎన్నికల్లో దీన్నే ప్రచారం చేసుకున్న టీఆర్ఎస్​
  • ఇప్పటికీ నోటిఫికేషన్లకు అతీగతీ లేదు
  • నిరాశలో నిరుద్యోగులు.. ఏజ్​బార్​ అవుతున్నదని ఆందోళన

రేపో మాపో 50 వేల కొలువులు నింపేస్తున్నమంటూ సీఎం ముచ్చట చెప్పవట్టి ఇయ్యాల్లటికి ఏడాదైతున్నది. కానీ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషనన్నా ఇచ్చింది లేదు. ఒక్క పోస్టన్నా నింపింది లేదు. ఖాళీల లెక్కలు తీసుడు దగ్గర్నే కేసీఆర్​ ప్రకటన ఆగిపోయింది.  రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ  చేయాలి. వేల సంఖ్యలో టీచర్ల, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతోపాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. 

నిరుడు డిసెంబర్​ 13న సీఎం... ‘‘రాష్ట్రంలో 50వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వేల సంఖ్యలో టీచర్​, పోలీస్​ ఉద్యోగాల రిక్రూట్​మెంట్​ జరగాల్సి ఉంది. వెంటనే ఖాళీలన్నీ గుర్తించి.. ఆ వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి” అని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత దాని మీద హడావుడి చేయడం, ఏ ఎన్నికలు వచ్చినా ‘‘త్వరలో జాబ్​ నోటిఫికేషన్లు వస్తయ్​’’ అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప భర్తీ చేయడం లేదు.   ప్రభుత్వం ప్రకటనలకే సరిపోతున్నదని, ఆ ప్రకటనలు కోచింగ్​ సెంటర్లకు గిరాకీ పెంచుతున్నాయని  నిరుద్యోగులు మండిపడుతున్నారు. కొలువుల కోసం ఎదురుచూసి చూసి తమకు ఏజ్​ బార్​ అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్  ఆశలు కల్పించి ఏడాదవుతున్నా అతీగతీ లేదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై క్లారిటీ వచ్చినా రాష్ట్ర సర్కార్ మాత్రం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. నాలుగేండ్లుగా ఎలాంటి జాబ్ నోటిఫికేషన్లు లేకపోవడంతో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులకు ఏజ్ బార్ అయింది. మరికొందరు ఏజ్​ బార్​కు దగ్గర్లో ఉన్నారు. ప్రభుత్వం ఏండ్లకేండ్లు ఉద్యోగాల భర్తీలో ఆలస్యం చేస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకుంటే.. ఏడేండ్లలో నామ్కేవాస్తేగా భర్తీ చేశారని, గ్రూప్​ 1 పోస్టులకు ఒక్క నోటిఫికేషన్​ ఇవ్వలేదని అంటున్నారు. 

1.91 లక్షల ఖాళీలు ఉన్నాయన్న పీఆర్సీ కమిటీ
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 39% పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిశ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని పీఆర్సీ కమిటీ గతంలో తన నివేదికలో వెల్లడించింది. మొత్తం 4,91,304 పోస్టులు శాంక్షన్డ్  స్ర్టెంత్ కాగా.. ప్రస్తుతం 3,00,178 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు ఆ కమిటీ తేల్చింది. ఇంకా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్టులో పేర్కొంది.  విద్యాశాఖలో 23,798 పోస్టులు, హోంశాఖలో 37,182, హెల్త్ డిపార్ట్ మెంట్ లో 30,570, రెవెన్యూశాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించింది. కానీ సీఎం కేసీఆర్​ నిరుడు డిసెంబర్​ 13న ‘‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నిటినీ భర్తీ  చేయాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలి” అని ఆదేశించారు. సీఎం చెప్పిన 50వేల పోస్టుల్లో సుమారు 16 వేల టీచర్ పోస్టులు.. 19,910 పోలీస్ ఉద్యోగాలు ఉండగా,  బీసీ వెల్ఫేర్ లో 1,027, మున్సిపల్ లో 1,533, పశుసంవర్ధక శాఖలో 1,500, వ్యవసాయ శాఖలో 1,740, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖల్లో 350, ఇతర శాఖల్లో మూడు నుంచి నాలుగు వేల ఖాళీలను అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఆ తర్వాత 70 వేల నుంచి 80 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు సాక్షాత్తూ సీఎం కేసీఆరే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు.

నోటిఫికేషన్ల ఆశతో కోచింగ్ కోసం లక్షల్లో ఖర్చు
రాష్ట్రంలో నాలుగేండ్లలో పోలీస్, టీచర్, లెక్చరర్ ఉద్యోగాలతోపాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుని లైబ్రరీల్లో, యూనివర్సిటీల్లో, కోచింగ్ సెంటర్లలో ఏండ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల్లో చాలా మంది గడిచిన నాలుగేండ్లలో ఏజ్ బార్ కు దగ్గరయ్యారు. గత పరీక్షల్లో ఉద్యోగానికి దగ్గరి వరకు వచ్చి జాబ్ మిస్ అయినోళ్లు లాస్ట్ అటెంప్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాది కింద సీఎం కేసీఆర్​ చెప్పిన  50 వేల పోస్టుల మాటలతో వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల  బాటపట్టారు. కిరాయి రూమ్ లు,  ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నారు. సీఎం ప్రకటనను నమ్మి ఏడాదిగా ఎదురు చూస్తున్నా ఒక్క నోటిఫికేషనన్నా రావడం లేదని నిరాశ చెందుతున్నారు. 

నిరుద్యోగులకు ఏజ్ బార్ టెన్షన్
తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అనేక మంది స్టూడెంట్​ లీడర్లు.. జాబ్ నోటిఫికేషన్లలో తమకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేయడంతో పదేండ్ల సడలింపు ఇస్తూ 2015 ఆగస్టులో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక్క ఏడాది మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. అయితే ఆ ఏడాది పెద్దగా జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో మరో ఏడాదికి పొడిగించింది. ఆ తర్వాత జాబ్ నోటిఫికేషన్లు కొన్ని విడుదలైనా పలు కారణాలతో లేట్​ అవడంతో మరో ఏడాది పెంచింది. ఆ తర్వాత నిరుద్యోగుల డిమాండ్ మేరకు 2017 ఆగస్టు 8న ఏజ్ లిమిట్ పై జీవో నంబర్ 190 జారీ చేసింది. ఈ జీవో వ్యాలిడిటీ 2019 జులై  26తో ముగిసింది. మూడేండ్లలో జాబ్ నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులు డిమాండ్  చేస్తున్నారు. దీనిపై  సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. లక్షన్నర మంది వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్​ అవుతున్న వాళ్లకు  40 ఏండ్లు దాటాయి. వీళ్లు ప్రస్తుత నిబంధన ప్రకారం ఉద్యోగాలకు అనర్హులు. పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవాళ్లలో  2 లక్షల మందికి 25 ఏండ్లు దాటాయి. కానిస్టేబుల్​ కొలువులకు వీళ్లు అనర్హులు. 

ఎన్నికల్లో ప్రచారం కోసమేనా..?
నిరుడు డిసెంబర్​ 13న సీఎం కేసీఆర్​ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటన కేవలం టీఆర్​ఎస్​కు ఎన్నికల ప్రచారంగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు 50 వేల ఉద్యోగాల భర్తీ  ప్రకటనను ప్రచారం చేశారు.  ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్స్ ఓట్లే కీలకంగా ఉన్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంది. కానీ ఈ ఎన్నికల తర్వాత ప్రభుత్వ పెద్దలు ఆ మాటను నిలబెట్టుకోలేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ  50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటలనే మంత్రులు ప్రచారం చేసి.. నిరుద్యోగుల ఓట్లు రాబట్టుకున్నారు. అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు వచ్చేసరికి 80 వేల పోస్టులను భర్తీ చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినా ఓటర్లు నమ్మలేదు. నిరుడు డిసెంబర్​ 4న వెలువడ్డ జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు ఎదురుదెబ్బ తగలడంతోనే కేసీఆర్​ 50వేల ఉద్యోగాల ప్రకటన చేశారని, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వ్యూహం వేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

లెక్కలు తీసుడు దగ్గ ర్నే ఆగిన ప్రకటన
నిరుడు డిసెంబర్​ 13న సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్ ఆధ్వర్యంలో అధికారుల కమిటీ ఖాళీల లెక్కలు తీసే పనిలో పడింది. ఆ తర్వాత 67 వేల ఖాళీల వివరాలతో కేసీఆర్​కు నివేదిక ఇవ్వగా.. లెక్కలు సరిగ్గా లేవని, పూర్తి వివరాలతో రావాలని సీఎం ఆదేశించారు.  70 వేల నుంచి 80 వేల ఖాళీలు ఉంటాయని టీఆర్ఎస్​ ప్లీనరీ, ఇతర సందర్భాల్లో సీఎం వ్యాఖ్యానించారు. ఖాళీల వివరాలు తేలినా.. ఇప్పటివరకు నోటిఫికేషన్లు మాత్రం విడుదల చేయడం లేదు.