అమెరికాతో కొనసాగుతున్న ట్రేడ్ చర్చలు.. ట్రంప్ టారిఫ్‌‌‌‌లను తట్టుకునేందుకు 4 వ్యూహాలు

అమెరికాతో కొనసాగుతున్న ట్రేడ్ చర్చలు.. ట్రంప్ టారిఫ్‌‌‌‌లను తట్టుకునేందుకు 4 వ్యూహాలు

 

న్యూఢిల్లీ: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు పలు స్థాయిల్లో కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు.  అయితే, ఈ నెల 25న జరగాల్సిన తదుపరి చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం భారత్‌‌‌‌కు వస్తుందా అనే విషయంపై స్పష్టత లేదని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల  7 నుంచి భారత ఎగుమతులపై 25శాతం టారిఫ్ విధించారు. రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు  ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం టారిఫ్ వేస్తామని ప్రకటించారు. అదనపు టారిఫ్ అమలు జియోపొలిటికల్‌‌‌‌ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఎగుమతులకు సపోర్ట్‌‌‌‌ 
ఎగుమతులకు మద్ధతుగా నిలిచేందుకు  నాలుగు దిశల వ్యూహాన్ని  బర్త్వాల్  ప్రకటించారు. అవి ఇతర మార్కెట్లలోకి ప్రవేశించడం,  ఎగుమతుల పోటీ సామర్ధ్యాన్ని పెంచడం, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడం,   వాణిజ్య ఒప్పందాలపై దృష్టి సారించడం.  ఇండియా–-ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్‌‌‌‌ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈసీటీఏ) కింద ప్రస్తుతం 85శాతం రాయితీలతో వాణిజ్యం జరుగుతోంది.  దీన్ని 100 శాతానికి పెంచాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.  బడ్జెట్‌‌‌‌లో ప్రకటించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్ త్వరలో అమలులోకి రానుంది. రాష్ట్రాలు కూడా పోటీ సామర్థ్యం పెంచేందుకు సహకరిస్తున్నాయి.

ప్రభుత్వం 90శాతం ఎగుమతులు జరిగే 50 దేశాలపై లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తోంది. దిగుమతుల కోసం కూడా ఇదే విధమైన వ్యూహం రూపొందించనుంది. అగ్రికల్చరల్‌‌‌‌ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) వంటి సంస్థలు వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను కొత్త దేశాలకు విస్తరించేందుకు పని చేస్తున్నాయి. అమెరికా టారిఫ్‌‌‌‌ల ప్రకటన తర్వాత  ఈ చర్యలను ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ టారిఫ్‌‌‌‌లతో కొన్ని రంగాలు ప్రభావితమవుతాయని అంగీకరించినప్పటికీ, ఎగుమతిదారులు మార్కెట్ డైవర్సిఫికేషన్ అవకాశాలపై దృష్టి పెడుతున్నారని బర్త్వాల్ చెప్పారు.