ఉల్లి ధరలు పడిపోయినయ్

ఉల్లి ధరలు పడిపోయినయ్

హోల్ ‌సేల్ ‌మార్కెట్‌లో కిలో రూ.3 నుంచి 9లో పేపలుకుతున్నయ్
గతేడాది ఇదే టైమ్లో కిలో రూ.18 నుంచి31 పలికినయ్
హైదరాబాద్ మార్కెట్లకు తెస్తే లారీల ఖర్చూ మిగుల్త‌లే

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో ఉల్లి ధరలు పడిపోతున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లలో కిలో రూ.3 నుంచి రూ.9లోపే రేటు పలుకుతున్నాయి. ప్రస్తుతం పంట దిగుబడి వచ్చే కాలం కావడంతో ఉల్లి హోల్‌సేల్ యావరేజీ ధరలు గరిష్టంగా కిలో ఐదారు రూపాయలలోపే ఉంటున్నాయి. కొత్త ఉల్లిగడ్డలకు ధర రాకపోవడంతో హైదరాబాద్ మార్కెట్‌లకు తీసుకువస్తే లారీల కిరాయి కూడా మిగుల్తలేదని రైతులు తేవడం లేదు. ఎక్కడికక్కడ లోకల్ మార్కెట్లకే పంటను తరలిస్తున్నారు. దీంతో లోకల్ మార్కెట్లలో ఉల్లికి డిమాండ్ తగ్గి మంచి ధరలు రావడం లేదు. మరోవైపు కరోనా ఎఫెక్ట్ వ‌ల్ల హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది జనం సొంతూళ్ల‌కు వెళ్లి పోవడంతో సిటీలో కూడా ఉల్లికి డిమాండ్ తగ్గింది. దీంతో ఇక్కడి మార్కెట్లలో సైతం ఉల్లికి డిమాండ్ లేక ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది.

గత ఏడాది కంటే తక్కువ
గతేడాది ఆగస్టునెలలో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.18 నుంచి రూ.31 వరకు పలికింది. కానీ గురువారం హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.2.89 నుంచి రూ.9.89 మధ్య రేటు పలికింది. యావరేజీగా రూ.6 వరకే ధర వచ్చింది. గత ఏడాది ఇంతకంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ధర పలికింది. ఈ ఏడాది ధరలు పడి పోవడంతో ఉల్లి రైతులు ఆందోళనలో మునిగారు.

ఉల్లి పంటకు వర్షం దెబ్బ
కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఉల్లిపంట దిగుబడులపై ప్రభావం పడుతోంది. వర్షాల వల్ల ఉల్లి పంటను తీయడం ఇబ్బందిగా మారింది. మరోవైపు ఉల్లి మడుల్లోనీరు నిలిచి గడ్డలు మురిగిపోయే పరిస్థితి ఉంది. కష్టపడి తీసి లారీల్లో మార్కెట్‌కు తరలించినా సరైన ధర రావడం లేదు. కొత్త పంటకు క్వింటాల్ యావరేజీగా రూ.600 వరకే వస్తోంది. పది, ఇరవై క్వింటాళ్లు పండిన రైతు మార్కెట్‌కు లారీల్లో తీసుకువస్తే గిట్టుబాటు అవడం లేదు.

మార్కెట్‌కు లోడ్లు తగ్గినయ్‌
హోల్‌సేల్‌ మార్కెట్‌లకు రాష్ట్రంలోని గద్వాల, మహబూబ్‌నగర్‌ తో సహా వివిధ జిల్లాల నుంచి, మహారాష్ట్ర, కర్నాటక, కర్నూల్‌, నుంచి ఉల్లి దిగుమతులు వస్తుంటాయి. గురువారం 44 లారీల్లో మాత్రమే దిగుమతి అయ్యాయి. మహారాష్ట్ర నుంచి 27, కర్నాటక నుంచి 4, కర్నూల్‌, గద్వాల నుంచి మిగతా లారీల్లో 10 వేల బస్తాల్లో ఉల్లి దిగుమతి అయింది. యావరేజీగా రోజూ కనీసం 70 లారీల వరకు వచ్చేవి. ఈ నెలలో ఇప్పటివరకు వచ్చిన అన్ని లోడ్లు కలిపినా, నిరుడు ఒక్కరోజు వచ్చినంత ఉల్లి రాలేదు. అయినా, ప్రస్తుతానికి రాష్ట్రంలో వినియోగదారులకు ఉల్లి సమస్య లేదు. కానీ రైతులకు మాత్రం తిప్పలు తప్పడంలేదు.

రైతులకు దక్కని లాభం రాష్ట్రంలో ఉమ్మడి వికారాబాద్‌ జిల్లా తాండూరు, మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌, అలంపూర్‌, నల్గొం డ తదితర ప్రాతాల్లో38 వేల 940 ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది.ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబరు నెలల్లోదిగుబడి వస్తుంది. ఈ ఏడాది వేసిన ఉల్లి ఈ నెల ప్రారంభం నుంచి జిల్లాల వారిగా ఎక్కడికక్కడ అవసరాలకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ హోల్ సేల్ మార్కెట్లలో ఉల్లికి డిమాండ్ తగ్గిపోవ‌డంతో రేట్లు కూడా అంతగా పెరగడం లేదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ధరలు తగ్గడంతో రైతులు హైదరాబాద్‌ తరలించకుండా లోకల్‌ గానే అమ్ముకుంటున్నారు. ఫలితంగా లోకల్ మార్కెట్లలో ఉల్లి ధరలు వినియోగదారులకు అందుబాటులోనే ఉన్నప్పటికీ, రైతులకు మాత్రం పెద్దగా లాభం లేకుండాపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం