కిలో ఉల్లి రూ.45.. ఒక్కసారిగా డబుల్ అయిన రేట్లు

కిలో ఉల్లి రూ.45.. ఒక్కసారిగా డబుల్ అయిన రేట్లు

మొన్నటి వరకు టమాటా... ఇప్పుడు ఉల్లి.. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఉల్లి పేరు వింటేనే మధ్య తరగతి కుటుంబీలు భయపడిపోతున్నారు. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఉల్లి రేట్లు అమాంతం పెరిగాయి.

హైదరాబాద్‌లో ఉల్లి ధరలు కొద్ది వారాల్లోనే రెట్టింపు అయ్యాయి. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఆ ఎఫెక్ట్​ ఉల్లి పంటపై పడింది. ఫలితంగా డిమాండ్​ కు తగ్గట్లు మార్కెట్ లో ఉల్లిపాయ లేకపోవడంతో ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. మొన్నటి వరకు కిలో ఉల్లిపాయ ధర 20 నుంచి 30 రూపాయలు ఉండేది. ఇప్పుడు కిలో ఉల్లిపాయ ధర 40 నుంచి 45 రూపాయలకు చేరుకుంది. ఈ రేటు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్ముతున్నారు.

కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. భారీ వర్షాల కారణంగా ఒక కిలో టమాట ధర 200  రూపాయల వరకు అమ్మారు.  ఆ తర్వాత ధరలు తగ్గాయి. టమాట రేట్లు పెరగడంతో చాలామంది వాటిని కొనడం తగ్గించేశారు. దీంతో రేట్లు కూడా తగ్గాయి. అప్పట్లో టమాట రేట్లు పెరిగినప్పుడు చాలామంది వాటిని కొనకుండా ఇతర కూరగాయాలపై ఎక్కువ ఫోకస్ చేశారు. 

ప్రజలకు కన్నీళ్లు పెట్టించేందుకు దేశంలో ఉల్లి ధరలు పెరుగుతుండటం సామాన్యుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇక పండగల సీజన్ కూడా ప్రారంభం కావడం.. అదే సమయంలో ఉల్లి ధరలు ఆకాశం వైపు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో వంటింట్లో ఉల్లిపాయలు మాయం అవుతున్నాయని సామాన్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.45 నుంచి రూ.50 మధ్య ఉండగా.. రానున్న రోజుల్లో మరింత భారీగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

వర్షాకాలంలో కర్ణాటక రైతులు ఉల్లి పంటను అధికంగా పండిస్తుంటారు. అయితే .. గత కొన్నేళ్లుగా సకాలంలో వర్షాలు కురవకపోవటంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి తోడు ఈసారి రుతుపవనాల ఆలస్యం కావడంతో క్షేత్రస్థాయిలో రైతులు ఉల్లి సాగుపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేసిన వేల హెక్టార్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోతోందని రైతులు వాపోతున్నారు.

తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. ధర పలకని కారణంగా చాలా ప్రాంతాల్లో రైతులు ఉల్లి సాగు తగ్గించగా.. ఈ సంవత్సరం భారీ వర్షాలు, వరదల కారణంగా చాలాచోట్లా ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఉల్లి దిగుబడి చాలావరకు తగ్గింది. అవసరాలకు తగినంత పంట మార్కెట్ లో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా మార్కెట్ లో వ్యాపారులు అమాంతం రేటు పెంచేశారు. హోల్ సేల్ మార్కెట్ లోనే రూ.40 నుంచి రూ.45 మధ్య విక్రయిస్తున్నారని చెబుతూ.. రిటైల్ గా రూ.50కి పైగా అమ్ముతున్నారు. కాగా దిగుబడి సరిగా లేదన్న విషయాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్ లో సరిపడా స్టాక్ ఉన్నా.. కొరత ఉందని చెబుతూ రేట్లు పెంచుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో జనాల్లో వ్యతిరేకత ఎక్కువై ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా మరికొద్దిరోజుల్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండగా.. ధరల నియంత్రణ అంశం ప్రభుత్వాలపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. దీంతోనే ఉల్లితో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ఉండేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

అయితే.. ఇప్పట్లో ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు. మరోవైపు.. నవంబర్ తర్వాతే ఉల్లి ధరలు తగ్గుతాయని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. చూడాలి. ఉల్లి ధరల పెరుగుదలపై సామాన్యులు ఎలా స్పందిస్తారో...!