లోన్ తీసుకోకున్నా అకౌంట్లో డబ్బులు జమ..తర్వాత వేధింపులు

లోన్ తీసుకోకున్నా అకౌంట్లో డబ్బులు జమ..తర్వాత వేధింపులు

లోన్ యాప్ నిర్వాహకుల అగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అమాయక జనాల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట వీరి బారిన పడి మోసపోతూ మానసిక వేదనకు గురవుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో యువకుడు లోన్ యాప్ ఉచ్చులో పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు తన అవసరం కోసం ప్లే స్టోర్ లో లోన్ యాప్ కోసం వెతికాడు. రేటింగ్ బాగుంది కదా అని వండర్ లోన్ అనే అప్లికేషన్ ను తన మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆధార్, పాన్ కార్డ్, తన సెల్ఫీ తో పాటు పూర్తి వివరాలు ఎంట్రీ చేశాడు.

వడ్డీ ఎక్కువగా ఉండటంతో లోన్ వద్దనుకొని అప్లికేషన్ ఒకే చేయకుండా రిమూవ్ చేశాడు.  అయినా.. అకౌంట్లో 9 వేల రూపాయలు జమయినట్టు మెసేజ్ వచ్చింది.  మళ్ళీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని చూడగా లోన్ అప్రూవ్ అయినట్టుగా ఉండడంతో అవాక్కయ్యాడు. డబ్బులు జమ అయిన వారం రోజుల తర్వాత లోన్ కట్టాలంటూ వాట్సాప్ కాల్స్, మెసేజేస్ రావడం మొదలయ్యాయి. దీంతో శ్రీనివాస్ 9 వేల రూపాయలు కట్టేశాడు. అయినా మెసేజ్ లు రావడం ఆగలేదు. ఇంకా డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తేవడమే కాకుండా....బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ లు కూడా పంపుతుండడంతో సైబర్ క్రైం పోలీసులను శ్రీనివాస్ ఆశ్రయించాడు. అంతటితో ఆగని దుండగులు తన పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయని....న్యూడ్ ఫోటోలు ఫోన్ కాంటాక్టులకు పంపుతామని బెదిరింపులకు గురి చేసినట్టు తెలిపాడు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.