నగరంలో 12 చోట్లనే ఎలక్ట్రిక్ మొబైల్ ​షీ టాయిలెట్లు

నగరంలో 12 చోట్లనే ఎలక్ట్రిక్ మొబైల్ ​షీ టాయిలెట్లు
  • సౌకర్యంగా, హైజీన్​గా ఉండడంతో ఉపయోగిస్తున్న మహిళలు
  • సిటీ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని డిమాండ్
  • నిర్వహణ లేక ఉపయోగపడని బల్దియా టాయిలెట్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​వ్యాప్తంగా ఉన్న జీహెచ్ఎంసీ షీ టాయిలెట్లు మెయింటెన్స్​ సరిగా లేక అధ్వానంగా తయారయ్యాయి. నీళ్లు రాక, ఎప్పటికప్పుడు క్లీన్ ​చేయక, డోర్లు ఊడిపోయి ఇలా ఒక్కోచోట ఒక్కో రకంగా ఉన్నాయి. వివిధ పనుల మీద ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలు వాటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించినా లేనిపోని రోగాలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. మెన్సస్​ టైంలో ఏదోక షాపింగ్​మాల్​కో, రెస్టారెంట్లకో పరుగులు పెడుతున్నామని కొందరు చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో సిటీలో అక్కడకక్కడ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ మొబైల్ షీ టాయిలెట్స్ మాత్రం ఉపయోగకరంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటివి సిటీ వ్యాప్తంగా ఇంకా ఏర్పాటు చేయాలని మహిళలు, సోషల్ ​యాక్టివిస్ట్​లు కోరుతున్నారు.

ఆపుకుంటే ఆరోగ్య సమస్యలు..

స్వచ్ఛభారత్‌‌‌‌లో భాగంగా జీహెచ్ఎంసీ గతంలో సిటీ వ్యాప్తంగా మహిళల కోసం షీ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాటి నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి చేతులు దులుపుకుంది. పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ దారుణంగా తయారయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర టాయిలెట్లు లేవు. ఉన్నచోట ఉపయోగపడట్లేదు. విదేశాల్లో ప్రతి 2 కి.మీ.కు ఒక పబ్లిక్​ రెస్ట్‌‌‌‌ రూం ఉంటుందని, అదేవిధంగా సిటీలోనూ ఏర్పాటు చేయాలని మహిళా యాక్టివిస్ట్​లు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ జామ్​లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, అంతసేపు ఉగ్గబట్టుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చాలా మంది వాపోతున్నారు. కొత్తవి ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నవాటిని మంచిగా మెయింటెన్ చేయాలని  కోరుతున్నారు.

9 గంటల నుంచి 5.30 వరకు

మెట్రో నగరాలకు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద కేంద్ర హోంశాఖ  నిర్భయ ఫండ్స్ ఇస్తోంది. వాటితో జీహెచ్ఎంసీ ఆరు జోన్లలో ‘ఎలక్ట్రిక్ మొబైల్ షీ టాయిలెట్స్’ ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌‌‌‌ జోన్‌‌‌‌లో 3 వెహికల్స్, ఎల్​బీనగర్‌‌‌‌లో 3,  ఖైరతాబాద్‌‌‌‌లో 2, చార్మినార్​లో 2, శేరిలింగంపల్లి, కూకట్‌‌‌‌పల్లి జోన్లలో ఒకటి చొప్పున అందుబాటులో ఉంచారు. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ స్టేడియం, ట్యాంక్ బండ్, ప్రగతి భవన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌బీనగర్‌‌‌‌‌‌‌‌, బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో ఇండియన్‌‌‌‌, వెస్ట్రన్ మోడల్స్‌‌‌‌లో టాయిలెట్ సీటింగ్ ఉంటుంది. వ్యర్థాలను మున్సిపల్ సీవరేజీ ట్యాంక్​కు అనుసంధానం చేశారు. బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్‌‌‌‌, మడత కుర్చీ, చిన్నారులకు డైపర్ మార్చేందుకు టేబుల్ వంటివి అమర్చారు. లాకర్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. వెహికల్ దగ్గర లేడీ వర్కర్ అందుబాటులో ఉన్నారు. అయితే ఇవి ​కేవలం రద్దీ, పర్యాటక ప్రాంతాల్లో  మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.

మెన్సెస్ ​టైంలో చాలా ఇబ్బంది

సిటీలో మహిళలు టాయిలెట్​కు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. డైలీ సిటీలో ట్రావెల్​ చేసేవాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపడడం లేదు. రోడ్ల వెంట ఉన్న టాయిలెట్లు అస్సలు హైజీన్​గా ఉండట్లేదు. వాటిలోకి వెళ్తే లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్న అధికారులు జనానికి ఉపయోగపడుతున్నాయా? లేదా చూడాలి కదా. నిర్వహణపై కనీస పర్యవేక్షణ ఉండట్లేదు. మెన్సెస్​ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటోంది. చుట్టుపక్కల ఏమున్నాయా అని చూసి పరిగెత్తాల్సి వస్తోంది. 2 కిలోమీటర్లకు ఒక షీ టాయిలెట్ ఏర్పాటు చేయాలి. వాటిని మంచిగా మెయింటెన్ చేయాలి. – లతా చౌదరి, సోషల్ యాక్టివిస్ట్‌‌‌‌

అవి బాగుంటలే.. ఇవి సూపర్

పనిమీద ఇంటి నుంచి బయటికి వస్తే ఆడవాళ్లు ఫేస్​ చేసే అతి పెద్ద ప్రాబ్లమ్​టాయిలెట్లు. మగవారిలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లలేం. జీహెచ్ఎంసీ షీ టాయిలెట్లు పెట్టినప్పటికీ చాలాచోట్ల అవి వాడుకునేలా ఉండట్లేదు. ఇంటికి వెళ్లే  వరకు ఆపుకోవాల్సి వస్తోంది. అక్కడక్కడ ఉన్న ఎలక్ట్రిక్ షీ టాయిలెట్స్ మాత్రం చాలా నీట్​గా ఉంటున్నాయి. అలాంటివి ఇంకా పెడితే బాగుంటుంది. – జయ, గృహిణి, ట్యాంక్‌‌‌‌బండ్

వాటిలోకి వెళ్లలేం

ఉద్యోగం, ఇతర పనుల మీద నేను డైలీ సిటీలో ట్రావెల్ ​చేస్తున్నా. ఆఫీసులో, తిరిగొచ్చాక ఇంట్లో తప్ప బయట ఎక్కడా టాయిలెట్ యూజ్​ చేయను. రోడ్ల వెంట ఏర్పాటు చేసిన వాటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. అధికారులు పట్టించుకుని మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడాలి. – కవిత, ఎంప్లాయ్‌‌‌‌,యూసుఫ్ గూడ