కేసీఆర్ ను గద్దె దించడం బీజేపీతోనే సాధ్యం

కేసీఆర్ ను గద్దె దించడం బీజేపీతోనే సాధ్యం

మునుగోడు: తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నా..టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు సమర భేరి సభలో మాట్లాడిన ఆయన..  కేసీఆర్ కుటుంబ పాలనను దించడం బీజేపీతోనే సాధ్యమన్నారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ తల్లి విముక్తి కావాలని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యను తీర్చేందుకు కేంద్రం రూ. 750 కోట్లు ఇచ్చిందని.. అది కూడా రాష్ట్రం ఇచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు చెప్పటం సిగ్గుచేటు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు.  

కేసీఆర్ నీకు దురద పెడితే నువ్వే గోక్కో.. మమ్మల్ని గోకమనకు అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు సమాధానం చెప్పే సత్తా ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు మేము మీటింగ్ పెట్టామన్న కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్ మునుగోడులో సభ ఎందుకు పెట్టిందో సమాధానం చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే ముందుగా మునుగోడులో సభ పెట్టారని.. అన్నీ ప్రజలు గమనిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.