గర్భవతికి షేవింగ్ బ్లేడ్‌తో ఆపరేషన్..

గర్భవతికి షేవింగ్ బ్లేడ్‌తో ఆపరేషన్..

ఉత్తరప్రదేశ్ దారుణం జరిగింది. నిండు గర్భవతికి షేవింగ్ బ్లేడ్‌తో ఆపరేషన్ చేయడంతో.. తల్లీబిడ్డ మృతిచెందారు. ఈ దారుణ ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని షైనీ గ్రామంలో రాజేష్ సాహ్ని అనే వ్యక్తి క్లినిక్ నడిపేవాడు. అతని దగ్గర 8వ తరగతి డ్రాప్ అవుట్ అయిన రాజేంద్ర శుక్లా అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. అయితే గ్రామానికి చెందిన ఒక మహిళ నిండు గర్భవతి. ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు.. క్లినిక్ తీసుకెళ్లారు. ఆ సమయంలో క్లినిక్‌లో రాజేష్ సాహ్ని లేడు. అక్కడే ఉన్న రాజేంద్ర శుక్లా మహిళకు సీ-సెక్షన్ చేయడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా.. షేవింగ్ కోసం ఉపయోగించే బ్లేడ్‌తో మహిళకు సర్జరీ చేశాడు. కాగా.. శిశువు జన్మించిన కాసేపటికే మృతిచెందింది. అంతేకాకుండా మహిళకు కూడా రక్తస్రావం ఎక్కువ అయింది. వెంటనే ఆమెను వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని మహిళ భర్త రాజారాంకు శుక్లా సూచించాడు. వెంటనే రాజారాం తన భార్యను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడికి వెళ్లగానే మహిళ మృతిచెందింది.

క్లినిక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్యాబిడ్డలు మృతిచెందారని రాజారాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న క్లినిక్‌లను మూసివేయాలని షైనీ గ్రామప్రజలు జిల్లా మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువచ్చారు.