ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. అలర్ట్ చేయకుంటే అందరూ కాలిబూడిదయ్యేవారు

ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. అలర్ట్ చేయకుంటే అందరూ కాలిబూడిదయ్యేవారు

చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సులో వెనుకవైపు మంటలు చెలరేగాయి. వెంటనే బస్సు ఆపరేటర్‌ అప్రమత్తం చేయడంతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.  

ఏం జరిగిందంటే..?

సెప్టెంబర్ 22 ఉదయం న్యూగో ఎలక్ట్రిక్ బస్సు కోయంబేడు(చెన్నై) నుంచి 20 మంది ప్రయాణికులతో  బెంగళూరు బయలుదేరింది. ఈ బస్సు చెన్నై సమీపంలోని చెంబరంబాక్కమ్‌ దగ్గరకు రాగానే, మరో ప్రైవేట్ బస్సుకు అతి దగ్గరకు వెళ్ళింది. దీన్ని గమనించిన బస్సు డ్రైవర్ ఢీకొట్టకుండా ఉండేందుకు సడన్ బ్రేకులు వేశాడు. దీంతో వెనుకవైపు ఉన్న బ్యాటరీ సర్క్యూట్ నుండి దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి. వెంటనే బస్సు ఆపరేటర్ గట్టిగా అరుస్తూ ప్రయాణికులను అప్రమత్తం చేయటంతో వారు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకి చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రయాణికుల నగలు, నగదు, విలువైన సామాన్లు మంటల్లో కాలిబూడిదైనట్లు సమాచారం. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.