హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్న కూడా దేశంలోని ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిత్యం పొరాడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మత రాజకీయాలు, ప్రజలను రెచ్చగొడుతూ హింస రాజకీయాలు చేయడంలో బీజేపీ దిట్ట అని ఫైరయ్యారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని అన్నారు. ఆదివారం సీఎల్పీలో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని సందర్శించి మత రాజకీయం చేస్తున్నారే గాని, దళిత, బీసీ, మైనారిటీ కుటుంబాలను పరామర్శించిన చరిత్ర బండి సంజయ్, అమిత్ షాకు లేదన్నారు. అన్ని కులాలకు సమన్యాయం చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు. హిందువాదంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిపై బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.
