
న్యూఢిల్లీ: ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన నిరసన విమర్శలకు దారితీసింది. మంగళవారం కొత్త పార్లమెంటు ఆవరణలో మెట్లపై ప్రతిపక్ష ఎంపీలు కూర్చుని ప్రొటెస్ట్ చేశారు. ఈ సమయంలో రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వెక్కిరింపులకు దిగారు. ఆయన హావభావాలకు అక్కడున్న నేతలంతా నవ్వారు. ఎదురుగా నిలుచుని ఉన్న రాహుల్ గాంధీ.. తన ఫోన్‌లో రికార్డు చేయడం గమనార్హం.
ఈ వీడియోలో కల్యాణ్ బెనర్జీ.. ‘‘నా వెన్నెముక నిటారుగా ఉంటుంది. నేను చాలా పొడగరిని’’ అని చైర్మన్‌లా అంటుండటం కనిపించింది. దీనిపై జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు. ఇది సిగ్గుచేటని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను ఎంపీ కల్యాణ్ అనుసరిస్తున్న వీడియోను బీజేపీ షేర్ చేసింది. ‘‘ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై ఒకవేళ దేశం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టయితే.. దానికి ఈ వీడియోనే సమాధానం. ఉపరాష్ట్రపతిని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎగతాళి చేస్తున్నారు. దీన్ని రాహుల్ ప్రోత్సహిస్తున్నారు. వీళ్లు సభలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎలా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుంటారో ఊహించుకోవచ్చు” అని ట్వీట్ చేసింది.