చైనాతో లొల్లిపై చర్చకు నో!

చైనాతో లొల్లిపై చర్చకు నో!

ప్రతిపక్షాల విజ్ఞప్తిని తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్

న్యూఢిల్లీ: బార్డర్‌‌లో చైనాతో జరుగుతున్న వివాదంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్ తిరస్కరించారు. అపొజిషన్ పార్టీలు ఇచ్చిన 9 నోటీసులను రిజెక్ట్ చేశారు. సభలో చర్చకు పెట్టిన అంశాలను సస్పెండ్ చేయాలని, చైనా చొరబాటుపై చర్చను టేకప్ చేయాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు పట్టుబట్టాయి. చైర్మన్‌కు అన్ని అధికారాలు ఉన్నాయని, ఆయన చర్చకు అనుమతించవచ్చని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కానీ చైర్మన్ ఒప్పుకోలేదు. రూల్స్ ప్రకారం వాటిని డ్రాఫ్ట్ చేయలేదని చెప్పారు. దీంతో కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ తదితర పార్టీల ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. 

నిబంధనలు పాటించాలి: జగ్‌దీప్

సభా వ్యవహారాలకు కలుగుతున్న అంతరాయాలు మంచి సంకేతాలు ఇవ్వడం లేదని రాజ్యసభ చైర్మన్ ధన్‌కర్ అన్నారు. గత వారం సభలో జరిగిన అంతరాయాలపై చర్చించేందుకు తనను తన చాంబర్‌లో కలవాలని కొంతమంది ఎంపీలను కోరారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. 267 రూల్ కింద తనకు 9 నోటీసులు అందాయని చెప్పారు. లిస్ట్‌ చేసిన అంశాలను సస్పెండ్ చేసి, ఇంకో అంశంపై చర్చించాలని నోటీసుల్లో పేర్కొన్నారని తెలిపారు. నోటీసుల్లోని విషయాలను కానీ.. వాటిని ఇచ్చిన వారి పేర్లను కానీ ఆయన వెల్లడించలేదు. లోపాలతో కూడుకున్న లేదా రూల్స్‌ ప్రకారం లేని నోటీసులపై తాను దృష్టి పెట్టలేనని చెప్పారు. ఎవరికి ఏది అనిపిస్తే అది చెప్పడానికి ఇది వేదిక కాదని, మనం నిబంధనలను పాటించాలని అన్నారు. డైలాగ్, డెలిబరేషన్, డిస్కషన్‌కు రాజ్యసభ వేదిక అని చెప్పారు. సభను క్లాస్‌రూమ్‌లా మార్చొద్దని కోరారు.

60 పాత చట్టాల రద్దుకు బిల్లు 

యాంటీ మారీటైమ్ పైరసీ బిల్లును వాయిస్ ఓటు ద్వారా సోమవారం లోక్‌సభ పాస్ చేసింది. 60 పాత చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో 137 ఏండ్ల కింద అమల్లోకి తెచ్చిన చట్టం కూడా ఉంది. మరోవైపు గత మూడేండ్లలో సాయుధ బలగాల కోసం వివిధ కేటగిరీల మూలధన సేకరణ కింద రూ.2,46,989 కోట్ల విలువైన 163 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.