ఫలించిన పైరవీ.. ఆగిన పోలీస్ బదిలీ

ఫలించిన పైరవీ.. ఆగిన పోలీస్ బదిలీ
  • పంతం నెగ్గించుకున్న ఏసీపీ కిరణ్​కుమార్​
  • బోధన్​ ఏసీపీగా నియమిస్తూ మళ్లీ ఉత్తర్వులిచ్చిన సర్కారు
  • సీసీఎస్​కు విజయ్​సారథి

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ ​జిల్లా బోధన్ ​ఏసీపీగా కేఎం కిరణ్​కుమార్​ను తిరిగి నియమిస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం రాజధాని సెంటర్​గా పెద్ద తతంగమే నడిచింది. ట్రాన్స్​ఫర్ ​క్యాన్సిల్​చేయించే బాధ్యత ఎత్తుకున్న ఓ పెద్ద లీడర్ కిరణ్​కుమార్​ను బదిలీ చేయించిన మరో పెద్ద లీడర్​ను ఒప్పించడానికి శ్రమించినట్లు తెలుస్తోంది. బోధన్​తర్వాత సీసీఎస్​లో డీఎస్పీ పోస్టింగ్​ఇచ్చినా జాయిన్​ కాని కిరణ్ తన ​పంతం నెగ్గించుకున్నారు. ఆయన స్థానంలో బోధన్ ​ఏసీపీగా అయిదు రోజులు డ్యూటీ చేసిన జె.విజయ్​సారథిని బదిలీ చేశారు. 

బీజం పడింది అప్పుడే..

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్​లో పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ సందర్భంగా తనపై హత్యాయత్నం జరిగినట్లు ఎమ్మెల్యే షకీల్ ​పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. మున్సిపల్​ చైర్​పర్సన్​పద్మ భర్త శరత్​రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్, మజ్లిస్​ లీడర్లు ఇందులో ఉన్నారని చెప్పడంతో ఏసీపీ కిరణ్​ అంటెప్ట్​ టు మర్డర్ ​కేసులు నమోదు చేయించి, కొందరిని జైలుకు పంపారు. ఈ టైంలో జైలులో ఉన్న తమ పార్టీ లీడర్లను పలకరించడానికి వచ్చిన మజ్లిస్​అధినేత, ఎంపీ అసదుద్దీన్​ఓవైసీ కొన్ని కామెంట్స్ చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, కవిత గెలుపు కోసం ఎలక్షన్లలో పని చేసిన తమ వారు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని, వచ్చే ఎలక్షన్​లో షకీల్​ను ఓడిస్తామన్నారు. దీంతో ఎమ్మెల్సీ కవిత పిలుపు మేరకు మున్సిపల్​ చైరపర్సన్ ​పద్మ, ఆమె భర్త శరత్​రెడ్డి రెండు సార్లు ఆమెను కలిశారు. తాము ఎమ్మెల్యేతో వరుసగా ఎదుర్కొంటున్న అవమానాలు, కేసులను వివరించారు. మజ్లిస్​గుస్సాను చల్లార్చడంతో పాటు శరత్​రెడ్డిని ఊరడించడానికి ఏసీపీ కిరణ్​ను బోధన్​ నుంచి తప్పించే నిర్ణయానికి అప్పుడే బీజం పడినట్లు తెలుస్తోంది. 

తెరపైకి విజయ్​సారథి

ఒక రాష్ట్ర మంత్రితో బంధుత్వం ఉన్న జె.విజయ్​సారథి కొన్నాళ్ల నుంచి పోస్టింగ్ కోసం వెయిట్​చేస్తూ హైదరాబాద్​ డీజీ ఆఫీసులో ఉన్నారు. కిరణ్​ స్థానంలో ఆయనను మంత్రి రెకమండ్​ చేయగా, చకాచకా పావులు కదిపి జులై 26న ఆర్డర్స్ ఇప్పించారు. ఆలస్యం చేయకుండా ఆయన మరుసటి రోజే జాయిన్ ​అయ్యారు.  ఈ టైంలో కిరణ్ ​లీవ్ ​తీసుకుని హైదరాబాద్​లో ఉన్నారు. విషయం తెలుసుకుని తన గాడ్​ఫాదర్​సూచనతో అక్కడే మకాం వేశారు. సీసీఎస్​ డీఎస్పీ పోస్టు ఇచ్చినా చేరలేదు. ఆయనకు అండగా ఉన్న పెద్దాయన ఎలక్షన్లలో సదరు ఆఫీసర్ ​అవసరాన్ని ప్రభుత్వ పెద్దలకు వివరించి ఒప్పించినట్లు సమాచారం. దీంతో కిరణ్​కు పాత పోస్టింగే కన్ఫామ్​ చేస్తూ ఆర్డర్స్​ఇచ్చారు. బోధన్​లో కంటిన్యూ కావాలని ఆగమేఘాల మీద వచ్చి చేరిన విజయ్ సారథి ​మరో పోస్టుతో సర్దుకోవాల్సి వచ్చింది. ​