
- తల్లిదండ్రులు చనిపోయి అనాథ అయిన బాలుడు
- అప్పు తీర్చడం కోసం వెట్టిచాకిరిలో పెట్టిన వైనం
- నాగర్ కర్నూల్ జిల్లా నల్లవెల్లిలో ఆలస్యంగా వెలుగులకి వచ్చిన ఘటన
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన బాలున్ని బాబాయ్,- పిన్ని తమ అప్పులు తీర్చేందుకు జీతగాడిని చేశారు. ఏడాది పాటు ఓ ఇంట్లో బాలుడిని వెట్టిచాకిరి చేయించిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన 14 ఏండ్ల బాలుడి అమ్మానాన్నలు చిన్నప్పుడే చనిపోయారు. అనాథ అయిన బాలుడు అదే మండలంలోని గంగారం గ్రామానికి చెందిన తన మేనత్త వద్ద ఉంటూ ఐదో తరగతి చదివాడు. గతేడాది సమ్మర్ సెలవుల్లో అదే మండలంలోని నల్లవెల్లికి చెందిన అతని బాబాయ్, పిన్ని వెళ్లి పది రోజులు తమ వద్ద ఉంచుకుంటామని తీసుకెళ్లి తిరిగి పంపించలేదు.
బాలుడిని చదువు మాన్పించి జీతగాడిని చేశారు. తాము చేసిన రూ. లక్ష అప్పు తీర్చేందుకు ఏడాదిగా ఓ ఇంట్లో పనిలో పెట్టారు. అక్కడ అవమానాలు, బాధలు తట్టుకోలేక బాలుడు రెండు రోజుల కింద పారిపోయి మేనత్త ఇంటికి చేరాడు. అసలు విషయం తెలుసుకుని వెళ్లి నిలదీయగా ‘ ఏం చేసుకుంటావో చేసుకో’ అని బంధువులను బెదిరించారు. బాలుడిని రక్షించేందుకు స్థానిక బాలల రక్షణ అధికారుల వద్దకు వెళ్లగా స్పందించలేదని బాలుడితో పాటు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దృష్టి సారించి, బాలుడి బాబాయ్, పిన్నిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.