ఆత్మకూర్ మండలంలో తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథలైన చిన్నారులు

ఆత్మకూర్ మండలంలో తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథలైన చిన్నారులు
  • సంరక్షణ బాధ్యతలు చూసేవారులేక..
  • పిల్లలను చేరదీసిన ఆర్టీసీ డ్రైవర్ దంపతులు 
  • ప్రభుత్వ సాయానికి చిన్నారుల ఎదురుచూపు 
  • సూర్యాపేట జిల్లా గట్టికల్ కు చెందిన  ఇద్దరు పిల్లల దీనస్థితి

సూర్యాపేట, వెలుగు: తల్లిదండ్రులతో పాటు తాత కూడా చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. వీరి పిల్లల ఆలనా పాలనా చూసేవారు లేక పక్కింటివాళ్లు చేరదీశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన మారపాక రాములు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. కాగా.. లక్ష్మి 2022లో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో చనిపోయింది. రాములు కూలీ పనికి వెళ్తూ తన ఇద్దరు కొడుకులను పోషిస్తున్నాడు. నాలుగు రోజుల కింద రాములు తండ్రి చనిపోగా.. అతని మృతిని మరువకముందే  రెండు రోజుల కింద రాములు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

 దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. వీరి సంరక్షణ బాధ్యతను చూసేవారు లేకపోవడంతో ఇంటి పక్కన ఉండే ఆర్టీసీ డ్రైవర్ రమేశ్ దంపతులు చేరదీశారు. ప్రస్తుతం చిన్నబాబు సాయి అంగన్​వాడీ స్కూల్ కు వెళ్తుండగా.. పెద్దబాబు శివ 6వ తరగతి చదువుతున్నాడు. వీరికి ప్రభుత్వ సాయం అందించాలని, ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా సాయం చేయాలనుకుంటే ఫోన్ పే నంబర్ 9490536944కు పంపించాలని రమేశ్ దంపతులు కోరుతున్నారు.