ఎటు చూసినా బురదే !..గ్రేటర్‌ వరంగల్‌ వరద ముంపు కాలనీల్లో దయనీయ పరిస్థితులు

ఎటు చూసినా బురదే !..గ్రేటర్‌ వరంగల్‌ వరద ముంపు కాలనీల్లో దయనీయ పరిస్థితులు
  • తడిసి ముద్దయిన నిత్యావసర సరుకులు, విలువైన వస్తువులు 
  • బురద కారణంగా దెబ్బతిన్న కార్లు, బైక్‌లు, ఆటోలు
  • తమ ఇండ్లను చూసి కన్నీరుమున్నీరైన బాధితులు

వరంగల్‍/వెలుగు ఫొటోగ్రాఫర్ : మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌ నుంచి ఓరుగల్లు ఇంకా తేరుకోవడం లేదు. వరద వదిలినప్పటికీ.. ఎక్కడికక్కడ బురద పేరుకుపోవడంతో ఇండ్లలోని నిత్యావసర సరుకులతో పాటు విలువైన సామగ్రి మొత్తం పనికిరాకుండా పోయాయి. నీటమునిగిన ప్రాంతాల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి వారే ఉండడంతో వరద కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం తలకు మించిన భారంగా మారనుంది.

నీట మునిగిన వేలాది ఇండ్లు

తుఫాన్‌ కారణంగా బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో భారీ వర్షం పడింది. దీంతో వరంగల్‌ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని 100 నుంచి 110 కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీల్లోని ఇండ్లలో మోకాలి లోతు వరకు నీరు నిలిచింది. హనుమకొండలో ఊర చెరువు పొంగడంతో పోటెత్తిన వరద పలు కాలనీల్లోని ఇండ్లు, షాపుల్లోకి చేరింది. వరంగల్‍, హనుమకొండ, కాజీపేట పరిధిలో సుమారు 30 వేల ఇండ్లు వరద ప్రభావానికి గురయ్యాయి.

 దీంతో వేలాది మంది పునరావాస కేంద్రాలకు చేరారు. రెండు రోజులు వానలు లేకపోవడంతో శుక్రవారం తమ ఇండ్లకు వెళ్లిన కాలనీవాసులు అక్కడి పరిస్థితికి ఆవేదనకు గురయ్యారు. వరద కారణంగా అత్యవసర సామగ్రి మొత్తం నీటిలో మునిగిపోగా.. మంచాలు, దుస్తులు, బీరువాల నిండా బురద పేరుకుపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. చేసేదేమీ లేక ఇండ్లను, సామగ్రిని క్లీన్‌ చేసుకుంటూ కనిపించారు. ఇంటి బయట పార్క్‌ చేసిన బైక్‌లు, కార్లు, ఆటోల ఇంజిన్లలోకి బురద చేరడంతో రిపేర్లు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 

 చిరు వ్యాపారులకు పెద్ద కష్టం

హనుమకొండ, వెలుగు : గ్రేటర్‌ వరంగల్‌ను ముంచెత్తిన వరదలు చిరు వ్యాపారులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. హనుమకొండ వంద ఫీట్ల రోడ్డుపై అమరావతి నగర్‌ నుంచి సమ్మయ్య నగర్, ఇంజినీర్స్ కాలనీ వరకు ఏర్పాటు చేసుకున్న జ్యూస్, ఇస్త్రీ, మెకానిక్‌, టీ షాప్స్‌, బిర్యానీ పాయింట్స్‌ కొట్టుకుపోగా, కొందరి ఆటోలు ధ్వంసం అయ్యాయి. వరంగల్‌ భద్రకాళి బండ్ వద్ద కూడా ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న షాపులు దెబ్బతిన్నాయి. దీంతో వాటిపైనే ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి.