ఆరెంజ్ అలర్ట్తో జంట జలాశయాలపై వాటర్బోర్డు ప్రత్యేక దృష్టి

ఆరెంజ్ అలర్ట్తో జంట జలాశయాలపై వాటర్బోర్డు ప్రత్యేక దృష్టి
  • ఉస్మాన్‌సాగ‌ర్ 4 గేట్లు, హిమాయ‌త్‌సాగ‌ర్ 1 గేట్ ఓపెన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాతావరణ శాఖ ఆరేంజ్​అలర్ట్​తో మెట్రోవాటర్​బోర్డు అధికారులు జంట జలాశయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందస్తు జాగ్రత్తగా జంట జలాశయాలకు చేరుతున్న నీటిని అధికారులు బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండీ అశోక్ రెడ్డి శనివారం జంట జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెవెన్యూ, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. 

ఎప్పటికప్పుడు వరద పరిస్థిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల జంట జలాశయాల పరీవాహక ప్రాంతాలైన జనవాడ, శంకర్​పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, అజీజ్​నగర్, శంషాబాద్​తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో భారీగా వరద నీటీని మూసీలోకి వదిలారు. ఫలితంగా మూసీ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఆ పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకు వాటర్​బోర్డు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

జలాశయాల్లోకి పెరుగుతున్న వరద

ఉస్మాన్ సాగర్ (గండిపేట) రిజర్వాయర్​కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతున్నందున 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 920 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ప్రస్తుతం 100 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది. అలాగే హిమాయత్ సాగర్ ఒక  గేట్‌ను 3 అడుగులు ఎత్తి 1,017 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక్కడ 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.  వాతావరణ సూచనలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదలను దశలవారీగా 2 వేల క్యూసెక్కులకు, ఉస్మాన్ సాగర్ నుంచి 3 వేల క్యూసెక్కులకు పెంచనున్నట్టు అధికారులు తెలిపారు.