ఓటీటీలు మస్తు వాడిన్రట

ఓటీటీలు మస్తు వాడిన్రట

దాదాపు 2020 మొత్తం లాక్‌డౌన్‌లనే గడిచిపోయింది. పిల్లలకు బళ్లు లేవు.. పెద్దోళ్లకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌. అందరు ఇంట్లనే ఉన్నరు. బయటికి పోయి తిరిగొచ్చే పరిస్థితి లేకపాయే. ఇక సినిమా హాళ్లు అయితే ఇప్పుడిప్పుడే ఓపెన్‌ అయినయ్‌. దీంతో 2020 మొత్తం ఓటీటీలను మన జనం మస్తు వాడిన్రట. పోయిన సంవత్సరంలో ఓటీటీ వాడకం13 శాతం పెరిగిందట. దాంతో పాటు స్పోర్ట్స్‌ కూడా మస్తుమంది చూశారని ‘రెడ్‌సీర్‌‌’ అనే కన్సల్టింగ్‌ సంస్థ చేసిన సర్వేలో తేలింది. లాక్‌డౌన్‌ కారణంగా కొత్త ఎపిసోడ్‌లు, సినిమాలు రాకపోవడంతో పాత సినిమాలు, ఫేవరెట్‌ షోలనే మళ్లీ మళ్లీ పెట్టుకుని చూసిన్రని సర్వే చెప్తోంది. సెప్టెంబర్‌‌ నెలలో ఐపీఎల్‌ స్టార్ట్‌ అవ్వడంతో అప్పుడు స్పోర్ట్స్‌కు క్రేజ్‌ పెరిగిందని రెడ్‌ సీర్‌‌ సీనియర్‌‌ కన్సల్టెంట్‌ నిఖిల్‌ అన్నారు. 2020 జనవరిలో చూసిన దానికంటే తర్వాత నెలల్లో వాడకం దాదాపు 50 శాతం పెరిగిందట. మంచి, క్వాలిటీ కంటెంట్‌ ఇచ్చే ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ రేటు ఎక్కువైనా జనం వాటినే తీసుకున్నారని సర్వే చెప్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌లో ఉండగా.. దాని తర్వాత అమెజాన్‌ ప్రైమ్, హాట్‌స్టార్‌, ఊట్‌ఉన్నాయి. సినిమా హాళ్లు లేకపోవడంతో మూవీస్‌ అన్నీ ఓటీటీల్లో రిలీజ్‌ అవ్వడమే కారణం. 2020 జనవరిలో 181 బిలియన్‌ నిమిషాల పాటు ఓటీటీలో చూసిన జనాలు సంవత్సరం చివరినాటికి 204 బిలియన్‌ నిమిషాలు చూశారు. సెప్టెంబర్‌‌, అక్టోబర్‌‌లో అది కాస్తా 228 బిలియన్‌ నిమిషాల నుంచి 231 బలియన్‌ నిమిషాలకు పెరిగింది. ఐపీఎల్‌ ఉండటం, నెట్‌ఫ్లిక్స్‌ రెండు రోజులు ఫ్రీ స్ట్రీమింగ్‌ ఇచ్చిన కారణంగా వాడకం పెరిగిందని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. దాదాపు 45 శాతం మంది హిందీ కంటెంట్‌ ఎక్కువగా చూసినట్లు సర్వేలో తేలింది.