సెక్యూరిటీ లేని.. ఓయూ లేడీస్ హాస్టళ్లు

సెక్యూరిటీ లేని.. ఓయూ లేడీస్ హాస్టళ్లు
  • హాస్టళ్లోకి చొరబడుతున్న ఆగంతకులు  
  • భయాందోళనలో విద్యార్థినులు 
  •  సీసీ కెమెరాలు ఉన్నా పని చేయడం లేదు 

సికింద్రాబాద్​, వెలుగు:  ఉస్మానియా క్యాంపస్‌‌ లో అమ్మాయిలకు రక్షణ కరవవుతోంది.  సెక్యూరిటీ లోపాలు, సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో బయటి వ్యక్తులు లేడీస్ హాస్టళ్లోకి ప్రవేశించి విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాఉస్మానియా క్యాంపస్‌‌ లో అమ్మాయిలకు రక్షణ కరవవుతోంది.  సెక్యూరిటీ లోపాలు, సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో బయటి వ్యక్తులు లేడీస్ హాస్టళ్లోకి ప్రవేశించి విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.  రు.  వారి భద్రతను పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం సంఘటనలు జరిగినపుడు మాత్రమే చర్యలు తీసుకుని ఆ తర్వాత వదిలేస్తున్నారని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. 

హాస్టల్‌‌లోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతకులు

ఈ నెల 3న  ఓయూలోని ఇంజనీరింగ్ లేడీస్​హాస్టల్‌‌లోకి  ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇద్దరు ఆగంతకులు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.  విద్యార్థినులు సెక్యూరిటీ సిబ్బందికి చెప్పగా వారు వచ్చే లోపే అక్కడ నుంచి ఆగంతకులు పారిపోయారు.  తిరిగి రాత్రి 11.30 గంటలకు,  అర్ధరాత్రి 2  గంటలకు ఆగంతకులు మరోసారి హాస్టల్‌‌ గోడ దూకి లోపలికి చొరబడ్డారు.  వారిని గుర్తించిన అమ్మాయిలు హాస్టల్‌‌ గదుల్లో లైట్లు వేసి కేకలు వేయడంతో గోడ దూకి పారిపోయారు.  ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పగా లేడీస్​ హాస్టల్ డైరెక్టర్ ​ వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోయారు.  

గతంలోనూ ఇలాంటి  ఘటనలు..

2011 జూన్​ 12  తెల్లవారుజాము 3 గంటల సమయంలో  ఓ ఆగంతకుడు లేడీస్​ హాస్టల్​ మెయిన్​ గేటు నుంచి  అమ్మాయిల గదుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.  అమ్మాయిలు గట్టిగా కేకలు వేయడంతో హాస్టల్​ వెనుక  వైపున కూలిపోయిన కాంపౌండ్​ వాల్​ దూకి పారిపోయాడు. విషయం తెలుసుకున్న అప్పటి  ఓఎస్​డీ  ప్రొఫెసర్​ లక్ష్మయ్య హాస్టల్‌‌కు రాగా ఆగ్రహించిన విద్యార్థినులు అతన్ని గదిలో బంధించారు.   ఓయూ అధికారులు హాస్టల్‌‌కు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బంధించిన ఓఎస్​డీని విడిచిపెట్టారు.  అనంతరం  జూన్​ 21న   సమావేశాన్ని నిర్వహించి సెక్యూరిటీ పెంచుతామని  హామీ ఇచ్చి  ఆ అంశాన్ని మర్చిపోయారు. కొద్ది నెలలకే  ఓ వ్యక్తి లేడీస్​ హాస్టల్​లోకి దూరి ఏకంగా ఓ అమ్మాయి గదిలో ఉన్న ల్యాప్​టాప్​ను దొంగిలించుకుని వెళ్లిపోయాడు.  ఈ రెండు సంఘటనల్లో ఇప్పటివరకు నిందితులను గుర్తించకపోవడం గమనార్హం.

విద్యార్థినిపై  కత్తితో దాడి..

2019  ఆగస్టు 15న అర్ధరాత్రి 3  గంటల సమయంలో  ఓ వ్యక్తి  లేడీస్​ హాస్టల్‌‌కు వెనక వైపు ఉన్న  గోడ పై నుంచి దూకి లోపలికి వచ్చాడు.  హాస్టల్​ రెండో అంతస్తుకు వెళ్లిన ఆగంతకుడు ఫోన్‌‌ మాట్లాడుతూ..  కారిడార్‌‌‌‌లో తిరిగాడు.  వాష్​రూమ్​వద్దకు వెళ్లి  ఓ విద్యార్థిని కత్తితో బెదిరించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.  అమ్మాయి సెల్​ఫోన్​లాక్కుని అక్కడ నుంచి గోడ దూకి పారిపోయాడు. దీంతో  తమకు రక్షణ కల్పించాలని డిమాండ్​ చేస్తూ వందల సంఖ్యలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వారం రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు.  ఈ ఘటనలో పోలీసులు పొట్టెల రమేశ్, ఎస్. సన్నీ  అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.  

సీసీ కెమెరాలు ఉన్నా ఫలితం శూన్యం..

2011లో  సంఘటన సమయంలో హాస్టల్‌‌లో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు.  దీంతో నిందితులను గుర్తించడంలో అధికారులు వైఫల్యం చెందారు.  2019లో  హాస్టల్​లో సీసీ కెమెరాలు ఉన్నా అవి ముందు వైపు మాత్రమే ఉండటం  వల్ల  ఫుటేజీ  లేకుండా పోయింది.  పోలీసులు సవాల్‌‌గా తీసుకుని  నానా తంటాలు పడి నిందితులను అరెస్టు చేయగలిగారు.  ఈ నెల 3న జరిగిన సంఘటన విషయానికొస్తే సీసీ కెమెరాలు ఉన్నా అవి పని చేయడం లేదు.  హాస్టళ్ల వద్ద మాజీ సైనికులైనా సెక్యూరిటీ గార్డులు పగలు మాత్రమే సీసీ కెమెరాలు ఆన్ చేసి రాత్రి ఆఫ్ చేస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.  

వారంలో సమస్యలు పరిష్కరిస్తాం : ఓయూ అధికారులు

విద్యార్థినులతో చర్చలు జరిపిన అధికారులు..  వారంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  ఓయూ వైస్ ​చాన్స్‌‌లర్‌‌‌‌​ ప్రొఫెసర్​ రవీందర్​, ఇతర అధికారులు హాస్టల్ సందర్శించారు.  హాస్టల్‌‌లో పరిస్థితుల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థినులతో సమావేశం నిర్వహించారు.  ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  సెక్యూరిటీ సిబ్బందిని పెంచుతామని,  రౌండ్ ద  క్లాక్​ సెక్యూరిటీని అప్రమత్తం చేస్తామని హామీ ఇచ్చారు.