ఓయూ స్టూడెంట్ల త్యాగాలను పార్టీలు విస్మరించినయ్‌‌ : గాదె వెంకట్‌‌

ఓయూ స్టూడెంట్ల త్యాగాలను పార్టీలు విస్మరించినయ్‌‌ : గాదె వెంకట్‌‌
  •     ఓయూ జేఏసీ చైర్మన్‌‌ గాదె వెంకట్‌‌

ఓయూ, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా స్టూడెంట్ల త్యాగాలకు, పోరాటాలకు రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఓయూ జేఏసీ చైర్మన్ గాదె వెంకట్ డిమాండ్ చేశారు. స్టూడెంట్ల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వారిని విస్మరిస్తున్నాయని, అలాంటి పార్టీలకు బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన కార్యక్రమంలో వెంకట్ మాట్లాడారు. ఉద్యమ కాలంలో స్టూడెంట్లు రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ప్రజలను ఐక్యం చేసిన చరిత్ర విద్యార్థి ఉద్యమ నేతలకే ఉందని గుర్తుచేశారు.

అంతటి త్యాగాలు ఉన్న విద్యార్థి ఉద్యమ నేతలను, ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రను నేటి రాజకీయ పార్టీలు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని గంపెడు ఆశలతో ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. టీఎస్పీఎస్సీ, ప్రభుత్వం కుమ్మక్కై పేపర్ లీకేజీలు చేయడంతో ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్ జేఏసీ, ఓయూ జేఏసీ నాయకులు కందుల మధు, పాపారావు, ఓదేలు, వంశీ యాదవ్  పాల్గొన్నారు.