విశ్లేషణ: ఓయూ భూములను ప్రైవేటోళ్లకు కట్టబెడ్తున్నరు

విశ్లేషణ: ఓయూ భూములను ప్రైవేటోళ్లకు కట్టబెడ్తున్నరు

ఎన్నో ఉద్యమాలు, బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల పాత్ర ఎంతో కీలకం. నాటి వందేమాతర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూది, మరెన్నో పరిశోధనలకు వేదికగా నిలిచి వందేండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉంది ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, శాస్త్రవేత్తలు, మేధావులను ఇలా ఎంతో మందిని సమాజానికి అందించిన ఒక మేధో కార్ఖానా అది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఉస్మానియా వర్సిటీ భూములకు రక్షణ కరువై అన్యాక్రాంతమవుతున్నాయి. కంచే చేను మేసిందన్న చందంగా వర్సిటీ భూములను కాపాడాల్సిన అధికారులే లీజుల పేరుతో, ఆదాయం సమాకూర్చుకునే పేరుతో పెట్రోల్ బంక్ లు, షాపింగ్ మాల్స్​కు కేటాయిస్తూ కొల్లగొడుతున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ భూములను ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులకు గానీ, సంస్థలకు గానీ కేటాయించరాదని వర్సిటీ భూములపై గతంలో నియమించిన జస్టిస్ ఓ.చిన్నపురెడ్డి కమిటీ స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీల నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న వర్సిటీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వాణిజ్య సంస్థలకు అక్రమంగా భూములను అప్పజెప్పడం బాధ్యతా రాహిత్యమే. ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభించినపుడు దాదాపు 2,400 ఎకరాలు ఉండాలి. ఆ తర్వాత అందులో కొంత భూమిని జాతీయ పరిశోధనా సంస్థలైన ఎన్జీఆర్ఐ, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్ఐఎన్  తదితర సంస్థలకు విద్యార్థుల ఉపయోగార్థం కేటాయించారు. మరికొంత భూమి కబ్జాలకు, ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. వీటిలో సినిమా థియేటర్, బార్లు, రెస్టారెంట్ల వంటివి ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం 1,600 ఎకరాలు మాత్రమే యూనివర్సిటీకి మిగిలింది. తార్నాకలో వర్సిటీ కాంపౌండ్ వాల్ ను ఆనుకొని బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇక వర్సిటీలో అడుగడుగునా అక్రమంగా నివాస సముదాయాలు ఏర్పాటు చేసుకుంటున్నా వర్సిటీ అధికారులు మౌనం వహిస్తున్నారు.

అధికారంలో ఉన్న వారి ఒత్తిళ్లతోనే..
తాజాగా మెకాస్టార్ ఆడిటోరియం సమీపంలో కోట్ల రూపాయల విలువ చేసే వర్సిటీ భూమిని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్, షాపింగ్ మాల్ లకు లీజు పేరుతో ధారాదత్తం చేయడం దుర్మార్గం. కబ్జాదారుల కబంధ హస్తాల్లో, కోర్ట్ కేసుల్లో ఉన్న భూమి వ్యవహారాలను కొత్త వైస్​ ఛాన్స్​లర్​  చక్కబెడతారని, విద్యార్థుల ఉపయోగార్థం వాటిని వాడుకుంటారని ఆశిస్తే.. అందుకు విరుద్ధంగా వాణిజ్యపరంగా లీజులకివ్వడం దారుణం. ఈ వ్యవహారంపై స్పందించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భూమిని లీజుకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని పెట్రోల్ బంక్, ఇతర నిర్మాణాలు ఆపేయాలని వర్సిటీ అధికారులు, పెట్రోల్ బంక్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, ధర్నాలు కూడా చేసింది. అయినా ప్రభుత్వ పెద్దల సహకారం, పోలీసుల రక్షణలో నిర్మాణాలు చేపడుతున్నారు. పదుల సంఖ్యలో పోలీసులు నిత్యం పెట్రోల్ బంక్ యాజమాన్యానికి కొమ్ముకాస్తూ అక్రమ కట్టడాలు నిలిపివేయాలని ప్రశ్నించిన విద్యార్థి నాయకులను అరెస్టు చేసి వారిపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ భూములను ఇలా వాణిజ్యపరంగా వ్యక్తులకు, సంస్థలకు కేటాయిస్తూపోతే భవిష్యత్ తరాలకు వర్సిటీ ఆనవాళ్లు, ఆర్ట్స్ కాలేజీ మినహా మరేమి మిగలదు. కానీ, వర్సిటీ అధికారులు మాత్రం భూములను అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకు తాకట్టు పెడుతూ, మరోవైపు ఆదాయం వస్తుందని భూములను లీజులకిచ్చామని నిస్సిగ్గుగా సమర్థించుకోవడం సిగ్గుచేటు.

ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు?
యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ అన్ని నిర్ణయాలను ప్రభావితం చేసే రాష్ట్ర ప్రభుత్వం ఓయూ పరిధిలో పెట్రోల్ బంక్, షాపింగ్ మాల్ నిర్మాణం జరుగుతున్నా, కబ్జాదారులు వర్సిటీ భూములపై కన్నేసినా ప్రభుత్వ పెద్దలు, విద్యా శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు. ఈ విషయం తమకేమి తెలియదన్నట్లు వ్యవహరించడం వెనుక మతలబేమిటో ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. గతంలో ఇదే తరహాలో అనేక మంది అధికార పార్టీ నాయకులు.. వర్సిటీ అధికారులను ప్రభావితం చేసి విలువైన భూములను అతి తక్కువ ధరలకు లీజులకు పొందారు. ఇప్పటికీ అదే ధరతో లీజులను కొనసాగిస్తున్నారు. వర్సిటీ అధికారులు కోర్టుల్లో సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆ భూములకు హక్కుదారులుగా, యజమానులుగా కొనసాగుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీలను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రకటించి.. అధికారం చేపట్టిన వెంటనే ఆ హామీని విస్మరించి వర్సిటీ భూములను ప్రభుత్వ అవసరాల నిమిత్తం వాడుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన విద్యార్థి లోకం, వర్సిటీ భూముల జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు.

వీసీల నియామకంలో నేతల పైరవీలు
స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హతా ప్రమాణాలను గాలికొదిలేసింది. అకడమిక్ సమర్థత, అడ్మినిస్ట్రేషన్ అనుభవం వంటి అత్యంత కీలక అంశాలను పరిగణించకుండా తన అనుయాయులను నియమిస్తుండడంతో వర్సిటీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో యూనివర్సిటీల్లో అకడమిక్, పరిశోధనా నాణ్యత నానాటికీ దిగజారిపోతున్నాయి. తమ వర్గానికి చెందిన వారిని వైస్ ఛాన్సలర్ గా నియమించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రూపులుగా ఏర్పడి పైరవీలు చేసి మరీ వర్సిటీలకు వీసీలను నియమించే పరిస్థితులు గమనిస్తే రాష్ట్రంలోని వర్సిటీల మనుగడే ప్రమాదంలో పడిందని అర్థమవుతోంది. తమ నియామకానికి సహకరించారని కృతజ్ఞతతో కొందరు వీసీలు ప్రభుత్వ కబంధ హస్తాల్లో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తూ.. వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం వర్సిటీల భవిష్యత్ ను తాకట్టు పెట్టడం హేయమైన చర్య. ఇది భవిష్యత్ తరాల పేద విద్యార్థులను యూనివర్సిటీలకు దూరం చేయడమే అవుతుంది.

ఆ భూములు మళ్లీ వర్సిటీ పరిధిలోకి రావు
నూతన జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం మల్టీ డిసిప్లీనరీ కోర్సులను ప్రవేశపెట్టాలంటే యూనివర్సిటీలకు సువిశాలమైన భవనాలు, మైదానాలు, అధునాతన లాబొరేటరీలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి తరుణంలో యూనివర్సిటీ భూములను ఆదాయం కోసం వాణిజ్యపరంగా ప్రైవేటు సంస్థలకు లీజుల పేరుతో అప్పగిస్తే ఆ భూములు మళ్లీ యూనివర్సిటీ అధీనంలోకి వస్తాయా? అన్నది గత అనుభవాల దృష్ట్యా ప్రశ్నార్థకమే. యూనివర్సిటీల్లో జరుగుతున్న భూముల కబ్జాలు, వర్సిటీ అధికారులు లీజుల పేరిట అక్రమంగా సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్న వ్యవహారంపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నిర్ధిష్ట ప్రణాళిక రూపొందించి యూనివర్సిటీల భూములను రక్షించే దిశగా కఠినంగా వ్యవహరించాలి. భవిష్యత్ తరాలకు అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించే ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

- ప్రవీణ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్