- అడ్మిషన్ ఉన్న విద్యార్థులను మాత్రమే అనుమతించాలి
- ఎన్ఎస్‌యూఐ నాయకుల డిమాండ్
ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీని పూర్తిగా క్లోజ్డ్ క్యాంపస్గా మార్చాలని, అడ్మిషన్ ఉన్న విద్యార్థులకు మాత్రమే లోపలికి ప్రవేశం కల్పించాలని ఎన్ఎస్‌యూఐ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ గేట్లను 24 గంటలూ మూసివేయాలన్నారు.
మంగళవారం ఆర్ట్స్ కాలేజీ వద్ద ఎన్ఎస్‌యూఐ నేతలు మాట్లాడారు. వర్సిటీలో అడ్మిషన్ లేని వ్యక్తులు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, ర్యాలీలు, కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదన్నారు. బయటి వాహనాలను క్యాంపస్‌లోకి అనుమతించకూడదని డిమాండ్ చేశారు.
క్యాంపస్ పరిసరాల్లో కిరాణా షాపులు, డ్రైవింగ్ శిక్షణ, సినిమా -షూటింగ్‌లు, రీల్స్ చిత్రీకరణలు అరికట్టాలని, జంతు బలి నిషేధించాలన్నారు. ఆర్ట్స్ కాలేజీ ముందు జరిగే బర్త్‌డే పార్టీలు, బాణసంచా కాల్చడంపై నిషేధం ఉండాలన్నారు.
ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే విడతలవారీగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ నాయకులు మే శ్రీను, మోహన్ కుమార్, నిత్య రెడ్డి, అభిలాశ్, అనిల్ కుమార్, ఓంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
