రోడ్డు లేదు..బస్సులు రావు..సెల్​ఫోన్ ​సిగ్నల్స్​ ఉండయ్

 రోడ్డు లేదు..బస్సులు రావు..సెల్​ఫోన్ ​సిగ్నల్స్​ ఉండయ్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ‘ మా ఊరి రోడ్లు సక్కగ లేవు. ఆర్టీసీ బస్సులు రావు. సెల్​ఫోన్​మాట్లాడదామంటే సిగ్నల్స్​ కూడా ఉండవు’ అంటూ ఓ గిరిజన యువతి కొత్తగూడెం ఎమ్మెల్యేను నిలదీసింది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల ప్రాంతంలో బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు బీఆర్ఎస్​ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. దీనికి కార్యకర్తలతో పాటు చుట్టుపక్కల పది గ్రామాల నుంచి జనాలను కూడా తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ  చేస్తున్న బంగారుచెలక గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి కె. లలిత అడ్డు తగిలింది. ‘కోవిడ్​టైంలో ఆన్​లైన్​క్లాసెస్​ జరిగాయి. అప్పుడు సెల్​ఫోన్​ సిగ్నల్స్​ రాలేదు.  చదువులెట్లా సాగాయో ఎవరైనా తెలుసుకున్నారా’ అని ప్రశ్నించింది. ‘మా ఊరికి బస్సులు రావడం లేదు, రోడ్లు బాగా లేవు. ఎన్నికలొస్తే మాత్రం మేమున్నామంటూ అందరూ వస్తారు’ అని అనడంతో అక్కడున్నవారంతా విస్తుపోయారు. ‘కష్టపడి చదువుకుని గ్రూప్​వన్​ఎగ్జామ్​రాస్తే దాన్ని కూడా లీక్​చేశారు. దీంతో పరీక్ష రాసిన విద్యార్థులంతా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.

ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు’ అని కొనసాగిస్తుండడంతో కొందరు బీఆర్ఎస్​ లీడర్లు అడ్డుకున్నారు. ఆమెకు సర్ది చెప్పి మాట్లాడకుండా చేసి కూర్చోబెట్టారు. బీఆర్ఎస్​ప్రజాప్రతినిధులు, నాయకులు భూక్యా సోనా, మండే హనుమంతరావు, వనమా రాఘవ, కాసుల వెంకట్​ కొట్టె వెంకటేశ్వర్లు, రాజు, దామోదర్​, కె. పద్మ, పవిత్ర, జక్కుల సుందర్​ పాల్గొన్నారు.