జనాభాలో మన దేశమే టాప్​కు చేరుతుంది: యూఎన్​ అంచనా

జనాభాలో మన దేశమే టాప్​కు చేరుతుంది: యూఎన్​ అంచనా
  • ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు వెల్లడి
  • 12 ఏండ్లలోనే 100 కోట్ల మంది పెరిగారు.. 2037 నాటికి 900 కోట్లకు చేరొచ్చు
  • ఇండియాలో యువత, చైనాలో వృద్ధులు ఎక్కువున్నరని రిపోర్ట్

యునైటెడ్ నేషన్స్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. కానీ వచ్చే ఏడాది ఆ ‘హోదా’ను కోల్పోనున్నది. ‘వన్ చైల్డ్ పాలసీ’, వరుసగా ఐదో ఏడాది కూడా జననాల రేటు పడిపోవడంతో రెండో స్థానానికి పడిపోనున్నది. చైనా స్థానంలో ఇండియా ఫస్ట్ ప్లేస్‌కు చేరుకోనున్నది. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్‌పీఏ) వెల్లడించింది. ఇండియాలో జనాభా పెరుగుదల అటు ఎక్కువగా ఉండకుండా.. ఇటు పడిపోకుండా స్టెబిలైజ్ అవుతున్నదని తెలిపింది. మరోవైపు ప్రపంచ జనాభా 800కోట్లకు చేరిందని మంగళవారం యూఎన్ఎఫ్‌పీఏ ప్రకటించింది. 700 కోట్ల నుంచి 800 కోట్లకు చేరడంలో ఇండియా కాంట్రిబ్యూషనే ఎక్కువని వివరించింది. తర్వాతి స్థానంలో చైనా ఉందని పేర్కొన్నది.

యంగ్ ఇండియా

యూఎన్ జనాభా అంచనాల రిపోర్టు ప్రకారం.. 2022లో ఇండియా జనాభా 141.2 కోట్లు కాగా.. చైనా జనాభా 142.6 కోట్లు. 2050 నాటికి ఇండియాలో పాపులేషన్‌ 166.8 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అదే సమయంలో చైనా జనాభా131.7 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఇండియా జనాభాలో 68% మంది దాకా 15 నుంచి 64 ఏండ్ల లోపు వాళ్లు ఉన్నారు. 65 ఏండ్లు పైబడిన వాళ్లు 7% మాత్రమే. ఇక 15 నుంచి 29 ఏండ్ల లోపు వాళ్లు 27% మంది ఉన్నారు. 10 నుంచి 19 ఏండ్ల లోపు వాళ్లు 25 కోట్ల మంది ఉన్నారు. ఈ ఏజ్‌ గ్రూప్‌లో ఇంత జనం ఇంకే దేశంలోనూలేరు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా 2030 దాకా ‘యంగ్ ఇండియా’ కొనసాగుతుందని యూఎన్‌ఎఫ్‌పీఏ చెప్పుకొచ్చింది. ఇండియన్ల సగటు వయసు 28.7 ఏండ్లే. ఇది ప్రపంచ సగటు కన్నా తక్కువ. ప్రపంచ సగటు 30.3గా ఉంది. 

2058లో వెయ్యి కోట్లకు!

ప్రపంచ జనాభా 800 కోట్ల మైలు రాయిని మంగళవారం అందుకుంది. 800వ కోట్ల శిశువు పుట్టినట్లు యూఎన్ఎఫ్‌పీఏ ట్వీట్ చేసింది. ‘‘800 కోట్ల ఆశలు.. కలలు.. అవకాశాలు.. మన భూమి ఇప్పుడు 800 కోట్ల మందికి ఇల్లు” అని పేర్కొంది. 800 కోట్ల మంది అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే ప్రపంచాన్ని మనమందరం కలిసి నిర్మించగలమని పేర్కొంది. గత 12 ఏండ్లలోనే 100 కోట్ల మంది పెరిగినట్లు వెల్లడించింది. 2037 నాటికి 900 కోట్లకు.. 2058 సంవత్సరం నాటికి వెయ్యి కోట్లకు జనాభా చేరే అవకాశం ఉందని యూఎన్ అంచనా వేసింది. 2080ల్లో సుమారు 1,400 కోట్లకు చేరుకుంటుందని, 2100 సంవత్సరం వరకు ఆ స్థాయిలోనే ఉంటుందని పేర్కొంది. 

జీవిత కాలం పెరుగుతున్నది..

ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవిత కాలం పెరుగుతున్నది. 2019లో మనిషి ఆయుర్దాయం సగటున 72.8 ఏండ్లు కాగా.. 2050 నాటికి 77.2 ఏండ్లకు చేరనుంది. ఫర్టిలిటీ పడిపోతుండటం, జీవితకాలం పెరుగుతుండటంతో పెద్ద వయసు వారి సంఖ్య ఎక్కువవుతున్నది. 2022లో 65 ఏండ్లు పైబడిన వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 10% వరకు ఉండగా.. 2050 నాటికి 16 శాతానికి పెరగనుంది. 

చైనాలో వృద్ధులు పెరుగుతున్నరు

చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నది. 60 ఏండ్లు పైబడిన వారి సంఖ్య 2019లో 25.4 కోట్లుగా ఉంది. ఈ సంఖ్య 2025 నాటికి 30 కోట్లకు, 2035 నాటికి 40 కోట్లకు చేరనుంది. దశాబ్దా లుగా చైనా అనుసరిస్తున్న ‘వన్ చైల్డ్ పాలసీ’నే ఇందుకు కారణం. ఐదేళ్లుగా అక్కడ జననాల రేటు పడిపోయింది. చైనాలో వృద్ధుల సంఖ్య కిందటేడాది 26.7 కోట్లకు చేరుకుంది. మొత్తం జనాభాలో ఇది 18.9%. 2040 నాటికి ఇది 28 శాతానికి పెరగనుంది.


ఇండియా నుంచే 17.7 కోట్ల మంది
ప్రపంచ జనాభా 700 కోట్ల నుంచి 800 కోట్లకు చేరడంలో.. ఇండియా కాంట్రిబ్యూషనే ఎక్కువ. వంద కోట్లలో 17.7 కోట్ల మంది ఇండియన్లు ఉన్నారు. తర్వాతి స్థానంలో చైనా(7.3 కోట్ల మంది) ఉంది. యూరప్‌లో మాత్రం జనాభా పడిపోతుందని చెప్పింది.

నెమ్మదిస్తున్నది..

700 కోట్ల నుంచి 800 కోట్లకు జనాభా చేరేందుకు 12 ఏండ్లు పట్టిందని, 900 కోట్లకు చేరేందుకు మాత్రం 14.5 ఏండ్లు పడుతుందని, దీన్ని బట్టి చూస్తే  ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల నెమ్మదిస్తుందని చెప్పింది. 2050 నాటికి కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లో నమోదయ్యే పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. 

ఇండియాలో స్టెబిలైజ్!

ఇండియాలో జనాభా స్టెబిలైజ్ అవుతున్నట్లు కనిపిస్తున్నదని యూఎన్ చెప్పింది. జాతీయ విధానాలు, ఆరోగ్య వ్యవస్థలు పనిచేస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నదని అభిప్రాయపడింది. జాతీయ స్థాయిలో ఫర్టిలిటీ రేటు 2.2% నుంచి 2 శాతానికి తగ్గడం శుభసూచకమని పేర్కొంది.