
టోంక్: పుల్వామా దాడి తర్వాత పలు ప్రాంతాల్లో కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరగడాన్ని ప్రధాని మోడీ ఖండించారు. ఉగ్రవాదం, మానవత్వానికే మచ్చలా మారిన ముష్కరులపైనే భారత్ పోరాటం చేస్తోందని చెప్పారు. మన పోరాటం కశ్మీరీలపై కాదని, కశ్మీర్ కోసమని చెప్పారు. ఉగ్రవాదం వల్ల కశ్మీరీలే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. కొద్ది రోజులుగా దేశంలో వారిపై జరుగుతున్నవి మంచిది కాదని, మనమంతా కశ్మీరీలకు అండగా నిలవాలని మోడీ సూచించారు. రాజస్థాన్ లోని టోంక్ లో శనివారం మధ్యాహ్నం జరిగిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గడిచిన 40ఏళ్లుగా కశ్మీర్ ప్రజలు ఉగ్రవాదం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. వారు కూడా శాంతి కోరుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రజలతో కలిసి ఉండాలనుకుంటున్నారని అన్నారు.
పాక్ పై పరోక్ష వ్యాఖ్యలు
టెర్రర్ ఫ్యాక్టరీ ఇలాగే కంటిన్యూ అయితే ప్రపంచ శాంతి అనేతి సాధ్యం కాదంటూ పాక్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోడీ. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఏకాభిప్రాయంతో ఉగ్రవాదంపై పోరాడుతోందన్నారు.
ప్రపంచమంతా అమరుల కుటుబాలకు అండగా..
పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఒక్క ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం అండగా ఉందని మోడీ అన్నారు. ప్రతి సైనికుడిపైనా తనకు నమ్మకం ఉందని, కేవలం 100 గంటల్లోనే దాడి చేసిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడం గర్వంగా ఉందని చెప్పారు.
ఇమ్రాన్ మాట నిలుపుకుంటారో లేదో చూద్దాం
ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైనప్పుడు.. ఆయనకు కంగ్రాట్స్ చెప్పానని అన్నారు మోడీ. పేదరికం, నిరక్షరాస్యతపై ఇద్దరం కలిసి పోరాడుదామని ఆ సమయంలో కోరానని చెప్పారు. దానికి ఆయన తానో పఠాన్ కొడుకునని, ఇచ్చిన మాటపై నిలబడతానని చెప్పారని మోడీ గుర్తు చేశారు. ఈ రోజు ఆయన మాటపై నిలబతారో లేదో తెలిసే టైం వచ్చిందని అన్నారు.
కశ్మీర్ వేర్పాటువాదులపై కఠిన చర్యలు
జమ్ము, కశ్మీర్ లోని వేర్పాటు వాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని మోడీ ప్రకటించారు. ఈ విషయంలో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. సరిహద్దుల్లో ఉన్న జవాన్లపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వారికి భవానీ మాత ఆశీస్సులు, మోడీ ప్రభుత్వ అండ ఉంటాయని చెప్పారాయన. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని అన్నారు.