మా భూములను వేరే వాళ్ల పేర్లపై మార్చిన్రు :హేమాజీపూర్​ రైతులు

మా భూములను వేరే వాళ్ల పేర్లపై మార్చిన్రు  :హేమాజీపూర్​ రైతులు
  • ధరణితో మోసపోయామంటూ ఎన్​హెచ్​–44 పై 
  • పోలీసులు వెళ్లగొట్టడంతో  తహసీల్దార్​ఆఫీసు ఎదుట బైఠాయింపు

బాలానగర్​, వెలుగు : ‘మా భూములను ధరణిలో వేరే వాళ్ల పేరుపై మార్చిన్రు. వెంటనే మా పేరు మీదికి మార్చకపోతే ఉరేసుకుని చస్తాం’ అంటూ మహబూబ్​నగర్​ జిల్లా బాలానగర్​ మండలం హేమాజీపూర్​ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. 'ధరణి'లో ఉన్న తమ భూములను తమ పేరుపై కాకుండా ఇతరుల పేరు ఎక్కించడాన్ని నిరసిస్తూ నేషనల్​ హైవే -44పై బైఠాయించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రైతులను అక్కడి నుంచి పంపించివేశారు. తర్వాత  అందరూ తహసీల్దార్​ఆఫీస్ కు వెళ్లి  ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 262 నుంచి 272 వరకు ఉన్న సర్వే నంబర్లలో వంద మందికి 220 ఎకరాల భూమి ఉందని, దీన్నంతా 'ధరణి'లో వేరే వారి పేరు మీదకు మార్చారని ఆరోపించారు. 

వారు ఆ భూములను వారి వారసుల మీద విరాసత్​ చేసి ఇతరులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికీ 30 సార్లు కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తే, తహసీల్దార్​ వద్దకు వెళ్లండని చెబుతున్నారని.. తహసీల్దార్​ దగ్గరకు వెళ్తే ఆర్డీఓ వద్దకు వెళ్లండని సమాధానం ఇస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే 'ధరణి' వ్యవస్థను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. రెవెన్యూలో ఉన్న రికార్డుల ప్రకారం తమ భూములను తమకు ఇప్పించి, కొత్త పాస్​బుక్స్​జారీ చేయాలని తహసీల్దార్​ను కోరారు. స్పందించిన ఆయన విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.