ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళలకు నిరాశే

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళలకు నిరాశే
  •     స్థానిక సంస్థలకే పరిమితం చేస్తున్నారని నేతల ఆవేదన
  •     14 స్థానాల్లో ఒక్కటీ కేటాయించని బీఆర్ఎస్ 
  •     ఇద్దరికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్

వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ప్రధాన పార్టీల నుంచి అసెంబ్లీ బరిలో నిలిచారు. అధికార బీఆర్ఎస్ సిట్టింగ్ లకే తిరిగి అవకాశం కల్పించటంతో మహిళలకు అవకాశం దక్కకుండా పోయింది. పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న మహిళా నేతలను స్థానిక సంస్థలకే పరిమితం చేయడంతో వారు కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండేందుకు కూడా సాహసించలేకపోతున్నారు.

అమరచింత పాత నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మహబూబ్ నగర్  జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా, హైకమాండ్​ పట్టించుకోలేదు. మహిళలకు అవకాశం కల్పించడంలో  రాజకీయ పార్టీలు ముందుకు రాలేదు.

డిమాండ్​కే పరిమితం..

మహిళా రిజర్వేషన్​ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారే తప్ప, మహిళలకు అసెంబ్లీ సీట్లు కేటాయించే విషయంపై మాత్రం దృష్టి పెట్టలేదని అంటున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్  బిల్లును బీజేపీ సర్కారు పార్లమెంట్​లో ప్రవేశపెట్టింది.

మరో ఐదారు ఏండ్ల తరువాత ఈ బిల్లు అమలులోకి రానుంది. అయితే ఈ బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్  చేశాయి. బీఆర్ఎస్  పార్టీ నేత కవిత సైతం మహిళా బిల్లు కోసం నిరసనలు చేపట్టినప్పటికీ, ఆ పార్టీ మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం.

ఈ సారి ఇద్దరికే అవకాశం..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సరిత బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్  పార్టీలో చేరడంతో ఆమెకు టికెట్​ కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం, అక్కడ మెజారిటీ ఓటర్లు బీసీలే కావడంతో కాంగ్రెస్  పార్టీ సరితను బరిలో దింపింది. ఇదిలాఉంటే నారాయణపేట అభ్యర్థిగా చిట్టెం పర్ణికారెడ్డికి కాంగ్రెస్  పార్టీ అవకాశం ఇచ్చింది.

ఆమెకు రాజకీయ వారసత్వం ఉండడంతో ఆ కుటుంబంపై ఉన్న సానుభూతి వర్కవుట్  అవుతుందని కాంగ్రెస్  భావిస్తోంది. మిగిలిన 12 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా మహిళలకు అవకాశం దొరకలేదు. టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసిన మహిళా నేతలు కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలు వారికి టికెట్లు కేటాయించకుండా పని కానిచ్చేశారని అంటున్నారు.

స్వర్ణమ్మకు ఆశాభంగం..

మహిళా కోటాలో దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట తనకు అవకాశం వస్తుందని భావించిన మహబూబ్ నగర్  జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణమ్మకు బీఆర్ఎస్  మొండి చేయి చూపింది. ఆమెకు టికెట్ కేటాయించకపోవడం పట్ల ఆమె తన సన్నిహితులతో ఆవేదన చెందుతున్నారు. బీజేపీకి చెందిన మహబూబ్ నగర్  మాజీ జడ్పీటీసీ జయశ్రీ టికెట్ కోసం ప్రయత్నించగా, ఆమెను కాదని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి టికెట్ ఇచ్చారు.

ALSO READ : మూడో లిస్ట్​ వచ్చినా ఇంకా మూడు పెండింగే

కొల్లాపూర్ టికెట్  ఆశించిన నాగర్ కర్నూల్  జిల్లా కాంగ్రెస్  పార్టీ మహిళా అధ్యక్షురాలు తిరుపతమ్మకు ఆ పార్టీ అవకాశం ఇవ్వలేదు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకు టికెట్ కేటాయించింది. దేవరకద్రలో కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక టికెట్  కోసం గట్టిగా ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ హైకమాండ్​ ఆమె గోడు పట్టించుకోలేదని అంటున్నారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి అవకాశం వస్తుందని భావించినా నిరాశే ఎదురైంది.