ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ నలుగురు మృతి..60 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ నలుగురు మృతి..60 మంది గల్లంతు
  • కుంభవృష్టితో ఉత్తర కాశీ జిల్లాను ముంచెత్తిన వరదలు
  • ఉప్పొంగిన ఖీర్​గంగా నది .. ధరాలీ గ్రామంపై విరుచుకుపడ్డ జలప్రవాహం
  • గ్రామం మొత్తం బురద.. హోటళ్లు, ఇండ్లు నేలమట్టం
  • కొట్టుకుపోయిన ఆర్మీ బేస్​ క్యాంపు.. 9 మంది జవాన్లు గల్లంతు
  • ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్​ను రంగంలోకి దింపిన సీఎం ధామి
  • శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తున్న బలగాలు
  • ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. హోంమంత్రి అమిత్​షా ఆరా

డెహ్రాడూన్:  ఉత్తరాఖండ్‌‌‌‌లో క్లౌడ్​ బరస్ట్‌‌‌‌తో వరదలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో ఉత్తరకాశీ జిల్లా అతలాకుతలమైంది. నదులు ఉప్పొంగడంతో జలప్రవాహం విరుచుకుపడింది. ఖీర్​గంగా నది పరీవాహక ప్రాంతంలో భారీ నీటిప్రవాహం పెరిగి, ఉత్తర కాశీలోని ధరాలీ గ్రామం మునిగిపోయింది. కొండలపై నుంచి వచ్చిన భారీ ప్రవాహంలో పలు ఇళ్లు కొట్టుకుపోగా.. అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మెరుపు వరద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్రామస్తులు భయాందోళనతో అరుస్తూ పరుగులు తీస్తుండటం వీడియోల్లో కనిపించింది.  ఈ ఘటనలో ఇప్పటివరకూ నలుగురు చనిపోగా.. దాదాపు 60 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బురదలో ఇండ్లు కూరుకుపోవడంతో అనేక మంది అందులో చిక్కుకున్నారు. 20-25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు.  కాగా, ధరాలీ గ్రామం గంగోత్రి వెళ్లే మార్గంలో ఉంటుంది. చార్‌‌‌‌ధామ్‌‌‌‌ యాత్రికులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. దీంతో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో హోటళ్లు, షాపులు ఉన్నాయి.

రెస్క్యూ ఆపరేషన్​లో సైన్యం

ఎస్‌‌‌‌డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అలాగే, కేంద్రం సహకారంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఐటీబీపీ, ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ బృందాలను అక్కడికి పంపించింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని ఈ బృందాలు రక్షిస్తున్నాయి. కాగా, నదీప్రాంతంలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు సూచనలు జారీ చేశారు. పిల్లలు, పెంపుడు జంతువులను నదీ సమీప ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. ఈ వారమంతా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. రెడ్​ అలర్ట్‌‌‌‌ జారీ చేసింది. కాగా, ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెంటనే స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, ఇతర బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిపారు. సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.  సీనియర్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు. 

పరిస్థితిపై ప్రధాని మోదీ రివ్యూ

వరద బీభత్సంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ధామితో  మాట్లాడి.. పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. ధరాలీ ఘటనలో బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.  సీఎం ధామికి  కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా  ఫోన్‌‌‌‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం తరఫున సహకారం అందిస్తామని వెల్లడించారు.

తృటిలో తప్పించుకున్న ఇద్దరు

ధరాలీ గ్రామాన్ని అకస్మాత్తుగా వరద ముంచెత్తడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ క్షణంలో ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఓ ఇద్దరు గ్రామస్తులు మాత్రం బురదలో చిక్కుకొని.. అతికష్టం మీద అందులోనుంచి బయటకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌‌‌‌లైన్​లో చక్కర్లు కొడుతున్నది. వారిద్దరూ బురద వెంబడిస్తుండగా.. పైకి వస్తుంటే పరుగెత్తూ.. పరుగెత్తూ.. అంటూ గ్రామ ప్రజలు అరవడం వినిపించింది.

వరదలో కొట్టుకుపోయిన కారు

వరదల్లో ప్రయాణికులతో కూడిన ఓ కారు కూడా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో కారు వరద నీటి మీద తేలుతూ కనిపించింది. ఆ దృశ్యాన్ని ప్రత్యేక్షంగా చూస్తున్న స్థానికులు కారులో మనుషులు ఉన్నట్లు గమనించి అరవడం కూడా వినిపించింది.  వీడియో మొత్తం 30 సెకన్ల నిడివి ఉండగా..చివరకు కారు ఏమైందో మాత్రం తెలియలేదు.  

ఆర్మీ క్యాంప్​లో 9 మంది సోల్జర్లు గల్లంతు

హర్షిల్ ప్రాంతంలోని ఇండియన్ ఆర్మీ క్యాంప్‌ను కూడా వరద ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు ఖీర్ గంగా నది క్యాచ్‌మెంట్ ఏరియాలోని క్యాంప్ పై ఒక్కసారిగా వరద వచ్చిపడింది. దీంతో క్యాంప్‌లోని 9 మంది జవాన్లు గల్లంతయ్యారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నాయి. సైనికులు గల్లంతైనప్పటికీ హర్షిల్‌లో 14 రాజ్‌రిఫ్ (రాజపుతానా రైఫిల్స్) యూనిట్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నది. వాతావరణం అనుకూలించనప్పటికీ వరదలో చిక్కుకున్న సుమారు 20 మందిని కాపాడారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి దాదాపు 80 మంది సైనికులు శ్రమిస్తున్నారు. చండీగఢ్, ఇతర వైమానిక స్థావరాల నుంచి చినూక్, ఎంఐ17, చీతా, ఏఎల్ హెచ్ హెలికాప్టర్లు ధరాలికి బయలుదేరాయి.  ఈ హెలికాప్టర్లు సహాయక సామగ్రితో  ప్రభావిత ప్రాంతాలకు చేరుకుంటాయి. దీనితో పాటు గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించడానికి సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, వైద్యులు, ఆర్థోపెడిక్ సర్జన్లతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా ధరాలికి పంపారు.

రంగంలోకి జాగిలాలు

వరదలో చనిపోయిన వారిని గుర్తించేందుకు ప్రభావిత ప్రాంతాలకు జాగిలాలను తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఒక జత కుక్కలను ఢిల్లీ నుంచి విమానంలో తరలించనున్నారు. ఈ కుక్కలు చనిపోయినవారితో పాటు బురదలో ఇరుక్కుపోయి ప్రాణాలతో ఉన్నవారిని కూడా పసిగట్టగలవని అధికారులు తెలిపారు.