రెండు రోజుల్లో నాలుగు బోర్లు! కేసీఆర్​ టూర్​ కోసం బీఆర్​ఎస్​ లీడర్ల ఓవరాక్షన్

రెండు రోజుల్లో నాలుగు బోర్లు! కేసీఆర్​ టూర్​ కోసం బీఆర్​ఎస్​ లీడర్ల ఓవరాక్షన్

జనగామ/ పాలకుర్తి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కోసం బీఆర్ఎస్​ లీడర్లు అత్యుత్సాహం చూపారు. ఓ రైతు పొలంలో నాలుగు బోర్లు వేయించడం, అవి ఫెయిల్​ అయినట్లు చూపించడం, సదరు రైతును కేసీఆర్​ఓదార్చడం.. అంతా ప్లాన్​ప్రకారం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది సరిపడా వర్షాలు లేకపోవడం, ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పంటలు ఎండుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్​ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులుగా బీఆర్ఎస్​ నేతలు ఎండిన పంటలను పరిశీలిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

ఇందులో భాగంగా కేసీఆర్ ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్​ తండాకు చెందిన మహిళా రైతు ఆంగోతు సత్తెమ్మకు చెందిన ఎండిన వరి పొలాన్ని పరిశీలించారు. కెనాల్​ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, నాలుగు బోర్లు వేసినా నీళ్లు పడలేదని కేసీఆర్​ ముందు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.  

ఆమెను ఓదార్చిన కేసీఆర్​.. బీఆర్ఎస్​ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, కేసీఆర్  పర్యటన షెడ్యూల్ కు ముందు ఆ బోర్లు లేవని, ఆయన షెడ్యూల్​ ఖరారయ్యాక  రెండు రోజుల్లో రాత్రికిరాత్రే ఆమె పొలంలో బోర్లు వెలిశాయని చుట్టుపక్కల రైతులు మీడియాకు చెప్పారు. హైవేకు దగ్గరగా సత్తెమ్మ పొలంలో కొంత భాగం నీరందక ఎండిపోయింది. ఈ పంటను కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రులు హరీశ్​ రావు, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. అప్పుడు లేని బోర్లు ఇప్పుడెలా వచ్చాయని, ఒక్కో మడిలో రెండు బోర్లు వరుసగా ఎందుకు వేయిస్తారని పలువురు ప్రశ్నించారు.  నిరుపేద సత్తెమ్మ నాలుగు బోర్లు ఎలా వేయించింది? నీళ్లు పడనప్పుడు పక్కపక్కనే ఎందుకు వేయించింది?  అని రైతులు చర్చించుకోవడం కనిపించింది. కాగా నాలుగు బోరు పాయింట్లలో ఏ ఒక్కటీ కనీసం 40 ఫీట్లు కూడా లేకపోవడం గమనార్హం.