40 శాతం సంపద ఒక శాతం మంది దగ్గర: ఆక్స్‭ఫామ్ నివేదిక

40 శాతం సంపద ఒక శాతం మంది దగ్గర: ఆక్స్‭ఫామ్ నివేదిక

దేశంలో ఆర్థిక అసమానతలపై ఆక్స్ ఫాం నివేదిక విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారం దేశ సంపదలో 40శాతం కేవలం ఒక శాతం ధనవంతుల వద్దే ఉందని తేలింది. సంపదలో కేవలం 3 శాతం మాత్రమే అట్టడుగున ఉన్న సగం జనాభా వద్ద ఉందని స్పష్టం చేసింది.. ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ పేరుతో విడుదల చేసిన  ఈ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించింది. ప్రపంచంలోని ధనవంతుల్లో ఒక శాతం మంది గత రెండేళ్లలో సంపాదించిన ఆస్తి.. మిగిలిన జనాభా సంపాదించిన మొత్తంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని నివేదిక తెలిపింది.

ఆక్స్ ఫామ్ నివేదికలోని ముఖ్యాంశాలు

* దేశంలోని తొలి 10 మంది బిలియనీర్లపై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే.. ఆ డబ్బుతో దేశంలో నిరుపేదలందరినీ చదివించవచ్చు. 

* 2017- 2021 మధ్య పెరిగిన గౌతమ్ అదానీ సంపదపై ఒకసారి విధించే పన్నుతో రూ.1.79 లక్షల కోట్ల నిధుల్ని సేకరించవచ్చని నివేదిక స్పష్టం చేసింది. ఈ మొత్తంతో దేశంలోని ప్రాథమిక స్కూళ్లలో 50 లక్షల మంది టీచర్లకు సంవత్సరం పాటు జీతాలు ఇవ్వొచ్చు.

 * దేశంలోని బిలియనీర్లపై ఒకసారి 2 శాతం పన్ను విధిస్తే.. రూ.40,423 కోట్ల ఆదాయం వస్తుందని.. దాంతో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు మూడేండ్ల పాటు పుష్టికరమైన ఆహారం అందించవచ్చు. 

* బిలియనీర్లపై ఒకేసారి 5శాతం పన్ను విధిస్తే 1.37 లక్షల కోట్లు వస్తాయని.. ఇది 2022 – 2023 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు), ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ.3,050 కోట్లు ) కు కేటాయించిన నిధుల కన్నా 1.5 రెట్లు ఎక్కువ.

* ఇక లింగ అసమానతల విషయానికి వస్తే పురుష కార్మికుడు రూపాయి సంపాదిస్తే.. మహిళా కార్మికులు కేవలం 63 పైసలు మాత్రమే సంపాదిస్తున్నారు.  

* షెడ్యూల్డ్ కులాలు, గ్రామీణ ప్రాంత కార్మికుల సంపాదనల్లో, వ్యత్యాసం ఎక్కువగా ఉందని.. అగ్ర వర్ణాలు సంపాదించిన దానిలో షెడ్యూల్డ్‌ కులాలు 55 శాతం మాత్రమే పొందుతున్నాయని ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించింది. 2018 – 2019 మధ్య కాలంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత కార్మికులు సగం ఆదాయాన్ని మాత్రమే పొందారు.

* కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 2022 నవంబరు నాటికి  దేశంలో బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది 

* 2021 20-22లో జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం రూ.14.83 లక్షల కోట్లలో దాదాపు 64 శాతం సంపదలో అట్టుడుగున ఉన్న 50సాతం జనాభా నుంచే వచ్చింది. జీఎస్‌టీ వసూళ్లలో కేవలం 3 శాతం మాత్రమే తొలి 10 మంది బిలియనీర్ల నుంచి వచ్చింది. దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా, 2022 నాటికి ఆ సంఖ్య 166కు పెరిగింది. ఇక దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద విలువ 660 బిలియన్ల డాలర్లు (రూ. 54.12 లక్షల కోట్లు) కాగా, ఈ మొత్తంతో కేంద్ర బడ్జెట్‌కు 18 నెలలకుపైగా అవసరమైన నిధులు సమకూర్చవచ్చు.

* ఓ వైపు 170 కోట్ల మంది వేతనాలు ద్రవ్యోల్బణం కన్నా దిగువ స్థాయిలో ఉంటే.. మరోవైపు బిలియనీర్ల సంపద రోజుకి 2.7 బిలియన్‌ డాలర్ల చొప్పున పెరుగుతోంది. ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే వచ్చే 1.7 ట్రిలియన్‌ డాలర్లతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయొచ్చని ఆక్స్ ఫామ్ నివేదిక చెప్పింది. 2020 తర్వాత జరిగిన 42 ట్రిలియన్‌ డాలర్ల సంపద సృష్టిలో 66.7 శాతం కేవలం ఒకశాతం మంది సంపన్నులే ఆర్జించారు. గత పదేళ్లలో వచ్చిన మొత్తం సంపదలో సగానికి పైగా వీరి చేతుల్లోకే వెళ్లిందని చెప్పింది. 

ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న జనాభాలో దాదాపు 60 శాతం మంది మహిళలు, బాలికలే ఉన్నారని ఆక్స్‌ఫామ్‌ నివేదిక స్పష్టం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అసమానతలు, పేదరికం భారీ ఎత్తున పెరిగిపోతున్నాయని ప్రపంచ బ్యాంక్‌ తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. ధనవంతులు, కార్పొరేషన్‌లకు దశాబ్దాలుగా ఇస్తున్న పన్ను తగ్గింపులే అసమానతలకు ఆజ్యం పోశాయని అభిప్రాయపడింది. అనేక దేశాల్లోని పేద ప్రజలే బిలియనీర్ల కన్నా ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారని చెప్పింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ 2014 – 2018 మధ్య కాలంలో 3 శాతం చొప్పున ట్యాక్స్‌ చెల్లిస్తే.. ఉగాండాలో పిండి అమ్ముకునే వ్యక్తి నెలకు 80 డాలర్లు సంపాదించి 40 శాతం పన్ను చెల్లిస్తున్నారని ఆక్స్‌ఫామ్ స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌ఎస్‌, కేంద్ర బడ్జెట్‌ డాక్యుమెంట్లు, పార్లమెంట్‌లో సభ్యుల ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల ఆధారంగా నివేదిక రూపొందించినట్లు ఆక్స్ ఫామ్ తెలిపింది.