కంపెనీల నుంచి హాస్పిటళ్ల దాకా ‘ఆక్సిజన్’ దోపిడీ

కంపెనీల నుంచి హాస్పిటళ్ల దాకా ‘ఆక్సిజన్’ దోపిడీ

ఉమ్మడి ఆదిలాబాద్​కు చెందిన ఓ ఆక్సిజన్ ప్లాంట్ నిర్వాహకులు రెగ్యులర్​గా హైదరాబాద్, ఒడిశా నుంచి లిక్విడ్ ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నారు. కరోనాకు ముందు 20 టన్నుల ట్యాంకర్ హైదరాబాద్, నాగపూర్​లో రూ.2 లక్షలకు దొరికేది. ప్రస్తుతం హైదరాబాద్​ కంపెనీలు డిమాండ్​కు సరిపడా సప్లై చేయలేపోవడంతో ఒడిశా నుంచి తెప్పిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో 20 టన్నుల ట్యాంకర్​కు రూ.15లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అంటే రేట్లు ఏడున్నర రెట్లు పెంచేశారు. దీంతో తాము కూడా రేట్లు పెంచక తప్పడంలేదని స్థానిక ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వాహకులు అంటున్నారు. ఆక్సిజన్ రేట్లను ఇలా కంపెనీలే అధికారికంగా పెంచి సొమ్ముచేసుకుంటున్నా ప్రభుత్వాలు కంట్రోల్​ చేయడం లేదు.

మంచిర్యాల, వెలుగు: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ కు ఏర్పడ్డ డిమాండ్​ను అటు కంపెనీలు, ఇటు ప్లాంట్ల నిర్వాహకులు, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ మేనేజ్​మెంట్లు, ట్రేడర్లు ఎవరి స్థాయిలో వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. కోవిడ్​కు ముందు రూ.500 ఉన్న బల్క్ సిలిండర్ ధర ప్రస్తుతం జిల్లాల్లో రూ.10వేలు, హైదరాబాద్​లో అయితే రూ.25వేలకు చేరిందంటే ఈ​ దోపిడీ ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా ట్రీట్ మెంట్​లో ఆక్సిజన్ అత్యంత కీలకం. బ్రీతింగ్ ప్రాబ్లమ్​తో స్టేట్​వైడ్ వేలాది మంది పేషెంట్లు హాస్పిటళ్లలో చేరుతున్నారు. ఆక్సిజన్ సాచ్యురేషన్ 94 శాతం కంటే తగ్గినవారికి ప్రాణవాయువు అందించాల్సి ఉంటుంది. సాచ్యురేషన్​ 80 శాతం కన్నా తక్కువుంటే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. దీంతో హాస్పిటళ్లలో ఆక్సిజన్​ వినియోగం బాగా పెరిగింది. ఉదాహరణకు మంచిర్యాలలోని హాస్పిటల్స్​లో గతంలో రోజుకు వంద సిలిండర్ల వినియోగం ఉంటే... ప్రస్తుతం 500 నుంచి 700 వరకు అంటే ఏడు రెట్లు వాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉన్నది.

అన్ని స్థాయిల్లో దోపిడీ..

రాష్ట్రంలో ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో ఉత్పత్తయ్యే ఆక్సిజన్‌ ప్రస్తుత డిమాండ్​కు సరిపోవట్లేదు. దీంతో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వాహకులు ఒడిశా నుంచి లిక్విడ్ ఆక్సిజన్​ను దిగుమతి చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్కడి కంపెనీలు రేట్లు భారీగా పెంచాయి. గతంలో 20 టన్నుల ట్యాంకర్ హైదరాబాద్, నాగపూర్​లో రూ.2 లక్షలకు దొరికేది. ఒడిశాలో ట్యాంకర్​కు రూ.15 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారు. ఈ కారణంతో స్థానిక ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వాహకులూ రేట్లు పెంచారు. గతంలో 7 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ బల్క్​ సిలిండర్ రేటు రూ.500 ఉండేది. ప్రస్తుతం ప్లాంట్లలోనే రూ.1,500 నుంచి 2,500 దాకా వసూలు చేస్తున్నారు. మెడికల్, కమర్షియల్ ఆక్సిజన్ సప్లై పర్మిషన్ ఉన్న డీలర్లు సిలిండర్లను బ్లాక్ చేసి రూ.10 వేల వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్​లో రూ.25 వేల దాకా పెట్టాల్సి వస్తోంది.

గంటకు రూ.500

భారీగా పెరిగిన ఆక్సిజన్​ రేట్ల భారం చివరకు పేషెంట్లపై పడుతోంది. కొన్ని హాస్పిటల్స్​లో గంటకు రూ.500 వసూలు చేస్తుండగా, మరికొన్ని హాస్పిటళ్లలో రోజుకు రూ.5వేల నుంచి రూ.10 వేల బిల్లు వేస్తున్నారు. వెంటిలేటర్​పై ఉన్న పేషెంట్​కు 24 గంటలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు గుంజుతున్నారు. కొన్ని హాస్పిటళ్లలో ఆక్సిజన్​ లేదని, పేషెంట్ల బంధువులే తెచ్చుకోవాలని చెప్తున్నారు. బ్లాక్​లో రూ.10వేలు పెట్టినా సిలిండర్​ దొరికే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కంపెనీలు, లోకల్​గా ఫిల్లింగ్ స్టేషన్లు, ప్లాంట్ల స్థాయిలో ఆక్సిజన్ రేట్లను తగ్గించాల్సి ఉండగా, ఆ పనిచేయడం లేదు. కేవలం బ్లాక్ దందా చేస్తున్నవాళ్లపై అడపాదడపా పోలీసులు కేసులు నమోదుచేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రేట్లు ఏమాత్రం తగ్గడం లేదని పేషెంట్ల బంధువులు అంటున్నారు.