ఓయో రూం డెత్ మిస్టరీ : ఆ ఇద్దరి చావు వెనక కారణాలు ఇవే..

ఓయో రూం డెత్ మిస్టరీ : ఆ ఇద్దరి చావు వెనక కారణాలు ఇవే..

ఢిల్లీలోని మౌజ్‌పూర్‌ ప్రాంతంలోని ఓయో హోటల్‌ గదిలో దంపతులు శవమై కనిపించిన కొద్ది రోజుల తర్వాత, మహిళను గొంతుకోసి చంపినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. ఆమెను హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని నవంబర్ 8న ఒక అధికారి తెలిపారు. అక్టోబర్ 27న ఓయో హోటల్ గదిలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సోహ్రాబ్ (28), అయేషా (27) మృతదేహాలు లభ్యమయ్యాయి.

"మహిళ (ఆయేషా) మరణానికి కారణం గొంతు కోయడమేనని పోస్ట్‌మార్టం పరీక్షలో వైద్యులు కనుగొన్నారు. వ్యక్తి (సోహ్రాబ్) మరణానికి కారణం ఆత్మహత్యేనని, ఉరి వేసుకోవడమే” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 27న రాత్రి 8.05 గంటలకు, కింగ్స్ స్టే ఓయో హోటల్‌లో రెండు మృతదేహాల గురించి కాల్ వచ్చింది. ఆ తర్వాత పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. సోహ్రాబ్, అయేషా ఓయో హోటల్‌లో మధ్యాహ్నం 1.02 గంటలకు చెక్ ఇన్ అయ్యారని, నాలుగు గంటలపాటు గదిని లాక్ చేశారని డీసీపీ తెలిపారు.

వారు ఎంతకీ బయటకు రాకపోవడంతో రాత్రి 7:45 గంటల సమయంలో హోటల్ సిబ్బంది తలుపు తట్టారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో బీట్‌ కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేశారు. పోలీసుల సమక్షంలో గది తెరిచి చూడగా సోహ్రాబ్‌ నైలాన్‌ తాడుతో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఆయేషా బెడ్‌పై శవమై పడి ఉంది. ఆమె మెడ మీద కొన్ని కోసిన గుర్తులు ఉన్నాయి. “ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, తమ జీవితాలను కలిసి ముగించాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటూ పక్కనే మంచంపై పడి ఉన్న ఆయేషా చేతితో రాసిన (హిందీలో) సూసైడ్ నోట్ కనుగొనబడింది” అని డీసీపీ చెప్పారు. “పోస్టుమార్టం నివేదిక తర్వాత హత్య కేసు నమోదు చేయబడింది. తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని డీసీపీ తెలిపారు.