
- ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జర్నలిస్టుల ఆందోళన
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : జర్నలిస్టులే లక్ష్యంగా దాడిచేయడం దుర్మార్గచర్య అని, సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై ఏపీ ప్రభుత్వం పోలీసులు దౌర్జన్యానికి పాల్పడడంపై శుక్రవారం ఖమ్మంలో జర్నలిస్టు సంఘాలు నిరసన తెలిపాయి. జడ్పీకార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిస్టు వ్యవస్థపై తెలుగు రాష్ట్రాల్లో దాడి జరుగుతోందన్నారు.
అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారికి అనుకూలంగా మాత్రమే వార్తలు రాయాలని పత్రికలు, విలేకరులు, ఎడిటర్ల పై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా చొరబడటం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నగర అధ్యక్షుడు మైసా పాపారావు, కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకుడు సయ్యద్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.