
- సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమస్య.. ఆందోళనలో రైతులు
సిద్దిపేట, వెలుగు: జిల్లాలో యాసంగి సీజన్ లో 2.65 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి మొదటి వారం వరకు వరి నాట్లు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల వరి నారుకు మొగి పురుగు సోకుతుండటం రైతులను కలవరపెడుతోంది. గజ్వేల్, వర్గల్, తొగుట, దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, చిన్నకోడూరు మండలాల్లో వరి నారుకు మొగి పురుగు బెడద తీవ్రంగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.
వాతావరణంలోని మార్పులతోనే..
ప్రస్తుతం వాతావరణంలోని మార్పులు, చలి మూలంగానే మొగి పురుగు బెడద వచ్చినట్టుగా వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పురుగు కాండాన్ని తొలచడంతో పంట ఎదుగుదల లేకుండా గింజలకు బదులు తాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా వరి గొలుసు కట్టే సమయంలో మొగి పురుగు సోకడాన్ని చాలా సీజన్లలో చూసినా.. ఇప్పుడు నారుకే ఇది ఆశించడం జిల్లాలో మొదటిసారి అని రైతులు చెబుతున్నారు.
అధికారుల సూచనలు..
మొగి పురుగు నివారణకు వ్యవసాయ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వరి నాట్లు వేసిన రైతులు క్లోరంత్రానిలిప్రోల్ గుళికలు 4 కిలోలు లేదా కార్తప్ 4జి గుళికలు 8 కిలోలు లేదా ఫెన్బురాకార్బ్ 3జి గుళికలు వాడాలని సూచిస్తున్నారు. దీనికి తోడు ఒక ఎకరాకు కార్తప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా కోరాజెన్ 60 మిల్లీ లీటర్ల రసాయనాలను చేయాలని చెబుతున్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి వరి నారుకు రక్షణ చర్యలు తీసుకుంటే కొంత మేర దిగుబడి నష్టాన్ని నివారించవచ్చునని చెప్తున్నారు.
చలి పెరగడంతోనే..
జిల్లాలో చలి పెరగడంతోనే వరి నారుపై మొగి పురుగు ప్రభావం చూపుతోంది. పలు ప్రాంతాల్లో ఈ సమస్యను గుర్తించి సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించాం. ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ వరినారుకు మొగి పురుగు సోకిన దాఖలాలు లేవు.. రైతులు ఆందోళన చెందొద్దు.. అప్రమత్తంగా వ్యవహరిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
–శివప్రసాద్, డిస్ట్రిక్ అగ్రికల్చర్ ఆఫీసర్